
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకూ పోరాటం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
కొత్తపల్లి: రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే వరకూ పోరాటం ఆగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. మండలంలోని కొమరగిరిలో గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని కొంతమంది కబ్జా చేయడంపై శుక్రవారం సీపీఐ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భూపోరాటం నిర్వహించారు. అనంతరం ఇళ్ల స్థలాలు లేని లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని కబ్జా చేస్తే అధికారులు పట్టించుకోకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. రెవన్యూ అధికారులు సైతం కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఉద్దేశంతో ఫేజ్–2లో 72ఎకరాల భూమిని రూ.32 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారన్నారు. దానిలో కొంతవరకూ మెరక చేశారని, అయితే సుమారు 42ఎకరాల భూమి మెరక చేయకపోవడంతో కొంతమంది కబ్జాచేసి భూమిని సాగు చేసుకుంటున్నారన్నారు. కొన్ని సంవత్సరాలుగా భూమిని కబ్జా చేసి సాగు చేస్తున్నా అధికారులు కొమ్ము కాస్తున్నారన్నారు. కొమరగిరి భూమి విషయంపై త్వరలో ఉపముఖ్యమంత్రిని, రెవెన్యూ శాఖామంత్రిని కలుస్తామన్నారు. డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ స్థలం వద్దకు వచ్చి పేదల నుంచి 1,400 ఇళ్ల స్థలాల దరఖాస్తులను స్వీకరించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగా ప్రసాద్ మాట్లాడుతూ అధికారులు భూమిని పేదలకు పంచాలని లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పి.సత్యనారాయణ, కేశవరపు అప్పలరాజు, మహిళ సమాఖ్య జిల్లా కన్వీనర్ భవాని, సమాచార హక్కుల వేదిక నాయకుడు బి.సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కన్వీనర్ వీరబాబు పాల్గొన్నారు.

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకూ పోరాటం