
పది పరీక్షల్లో మార్గదర్శకాలివే..
రాయవరం: పదవ తరగతి పరీక్షలు సోమవారం నుంచి జిల్లా అంతటా ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టింది. శనివారం మధ్యాహ్నం అన్ని పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు అందజేశారు. సీసీఈ విధానంలో ప్రారంభం అవుతున్న పది పరీక్షల్లో 15 నిమిషాలు పరీక్ష పేపరు చదువుకునేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారు. పది పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చీఫ్, డీవోలతో పాటు ఇన్విజిలేటర్లు చేయాల్సిన విధులపై ‘సాక్షి’ కథనం.
ఇన్విజిలేటర్లకు సూచనలు
● ఇన్విజిలేటర్లు ఫొటో గుర్తింపు కార్డు తీసుకోవాలి. రోజూ తప్పకుండా ఐడీ కార్డు ధరించాలి.
● పరీక్ష పేపర్ల కోడ్స్, సరైన కాంబినేషన్ గురించి విధిగా తెలుసుకోవాలి.
● పరీక్ష రోజు ఉదయం 8.30 గంటలకు కేంద్రం వద్దకు హాజరు కావాలి.
● తొమ్మిది గంటలకు విద్యార్థులను పరీక్ష గదిలో కూర్చోబెట్టాలి. 9.30 గంటల తర్వాత విద్యార్థులను అనుమతించరాదు.
● ప్రతి విద్యార్థిని సోదా చేసి, ఎటువంటి ఫర్‌బిడెన్ మెటీరియల్ లేదని నిర్ధారించుకోవాలి.
● విద్యార్థినులను మహిళా ఇన్విజిలేటర్లు మాత్రమే సోదా చేయాలి.
● విద్యార్థులకు ఫొటో, అన్ని వివరాలతో కూడిన హాల్ టికెట్ అందిస్తారు. విద్యార్థిని హాల్ టికెట్, అటెండెన్స్ షీట్‌లోని ఫొటోతో పోల్చి నిర్ధారించుకోవాలి.
● అభ్యర్థిపై అనుమానం ఉంటే వెంటనే సీఎస్ దృష్టికి తీసుకుని వెళ్లాలి.
● అన్ని పరీక్షలు బార్ కోడింగ్ విధానంలో జరుగుతాయి. ఉదయం 8.45 గంటలకు ఓఎంఆర్ ప్రధాన/అదనపు సమాధాన పత్రాలు సీఎస్ నుంచి పొందాలి.
● ప్రధాన సమాధాన పత్రంలోని సూచనలను, ఓఎంఆర్ షీట్ వెనుక భాగంలో సూచనలు విద్యార్థులకు వివరించాలి.
● ఓఎంఆర్ షీట్ మినహా ఏ పేపర్‌పైనా కూడా హాల్ టికెట్ నంబరు, పేరు రాయించరాదు.
● ఓఎంఆర్ షీటు ఏదైనా కారణంతో పాడైతే, వెంటనే సీఎస్ దష్టికి తీసుకుని వెళ్లి, నాన్ స్టాండర్డ్ ఓఎంఆర్ షీట్ పొందాలి.
● ఓఎంఆర్ షీట్‌పై ఉన్న బార్‌కోడ్‌పై రాయడం గాని, నలపడం గాని చేయకుండా విద్యార్థులను హెచ్చరించాలి.
● 9.25గంటల లోపు ఇన్విజిలేటర్ అన్ని పనులు ముగించుకుని 9.30గంటలకు కచ్చితంగా ప్రశ్నపత్రాలు ఇవ్వాలి.
● ప్రశ్న పత్రాలు తీసుకున్న వెంటనే సరిపడినన్ని ఉన్నాయా? ఆ రోజుకు సంబంధించిన సబ్జెక్టు/పేపర్‌కోడ్/ మీడియం సరిచూసుకోవాలి.
● పేపరు ఏ మాత్రం తప్పుగా ఇచ్చినా సంబంధిత ఇన్విజిలేటర్‌పై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. – గైర్హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ షీట్‌ను ఎర్ర సిరా పెన్‌తో క్యాన్సిల్ చేయాలి.
● సమాధాన పత్రాలు, అడిషనల్ షీట్స్ అన్నీ సరిచూసుకున్నాకే విద్యార్థులను పంపాలి.
సీఎస్, డీవోలకు సూచనలు
రోజూ ఉదయం 7.45 గంటలకు సెట్ కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలి.
నిర్దేశించిన సమయానికన్నా ముందు సీఎస్, డీవో ఇద్దరు సంతకాలతో పరీక్షల కట్టల సీల్ తెరవాలి.
లాటరీ పద్దతిలోనే ఇన్విజిలేటర్లకు తరగతి గదులు కేటాయించాలి.
అనుమతి లేని వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరాదు.