నువ్వులు.. రైతన్న మోములో నవ్వులు | - | Sakshi
Sakshi News home page

నువ్వులు.. రైతన్న మోములో నవ్వులు

Mar 15 2025 12:33 AM | Updated on Mar 15 2025 12:33 AM

నువ్వ

నువ్వులు.. రైతన్న మోములో నవ్వులు

పిఠాపురం: గతంలో ఖాళీగా ఉన్న భూముల్లో ప్రత్యామ్నాయంగా సాగు చేసే నువ్వుల పంటను ఇప్పుడు ప్రధానంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం నవ్వుల పంట ఆశాజనకంగా ఉందని రైతులు చెబుతున్నారు. గతంలో కేవలం ఎకరాకు రెండు బస్తాలు కూడా రాని దిగుబడి.. ఇప్పుడు ఎకరాకు 8 నుంచి 12 బస్తాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొక్కజొన్న, మిరప, వంగ, టమాటా వంటి పంటలను తగ్గించి, ఎక్కువ మంది రైతులు నువ్వుల సాగు చేపట్టారు. దీంతో కాకినాడ జిల్లాలో నువ్వుల సాగు గణనీయంగా పెరిగింది. గతంలో కేవలం 100 ఎకరాల్లో మాత్రమే ఉండే ఈ పంట సాగు, ప్రస్తుతం రికార్డు స్థాయిలో కేవలం ఒక్క గొల్లప్రోలు మండలంలోనే సుమారు 450 ఎకరాల్లో కొనసాగుతోంది. జిల్లాలో 590 ఎకరాల్లో సుమారు 350 మంది రైతులు నువ్వుల సాగు చేపట్టారు. సాధారణంగా ఏటా 3,540 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తున్నారు.

ఉష్ణోగ్రతే దీనికి ప్రాధాన్యం

ఈ పంటకు 25 డిగ్రీల నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమవుతుంది. నీరు నిలవని, మురుగు నీరు రాని ప్రాంతాలు వీటికి అనుకూలం కావడంతో, రేగడి నేలలున్న ప్రాంతాల్లో 90 శాతం మంది రైతులు వీటిని సాగు చేస్తున్నారు. ఆమ్మ, క్షార నేలలు అంతగా అనుకూలం కాదు. గౌరి, మాధవి, వైఎల్‌ఎం 11, 17, 66 రకాలు మంచి దిగుబడులు ఇస్తాయని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రకాలనే జిల్లాలో అత్యధికంగా సాగు చేపట్టారు. కేవలం 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికందుతుంది. ఇందులో 50 శాతం నూనె దిగుబడి వస్తుంది. ఎకరాకు వరుసల్లో విత్తుకుంటే 2 కిలోలు, వెదజల్లితే 4 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తన శుద్ధి చేయడం ద్వారా తెగుళ్లు, పురుగుల దాడి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలకు మధ్య కనీసం అరడుగు దూరం ఉండేలా నాటడం వల్ల అధిక దిగుబడి వస్తుందని అధికారులు సూచిస్తున్నారు. కలుపు నివారణకు ప్రాధాన్యమివ్వాలి. ఆకు ముడత, కాయ తొలుచు పరుగుల నుంచి రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించే అవకాశాలున్నాయి. ఆకు ఎండు, ఆకు కుళ్లు తెగుళ్ల దాడి చేసే అవకాశం ఉండడంతో, ముందుగానే సస్యరక్షణ చర్యలు పాటించాల్సి ఉంటుంది. ఆకు కాయలు 75 శాతం పసుపు రంగుకు మారితే కోత దశకు చేరుకున్నట్టు గుర్తించి, కోతలు చేపట్టాలని అధికారులు అంటున్నారు. కోసిన పంటను కట్టలుగా కట్టి, అదే పొలంలో ఎండకు ఎండేలా నిలబెట్టి, ఐదు రోజుల తర్వాత నూర్చుకోవాలి. ప్రస్తుతం క్వింటాల్‌ నువ్వుల ధర రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు ఉంది. ఎకరాకు ఆరు క్వాంటాళ్లకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్టు రైతులు చెబుతున్నారు. కేవలం ఆరుతడి, విత్తనం ఎరువులు తదితర అవసరాలకు ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి అవుతున్నట్టు తెలిపారు.

కరోనాతో నువ్వుల నూనెకు డిమాండ్‌

పెరిగిన నువ్వుల సాగు

ఆశాజనకంగా పంట

ఎకరాకు ఆరు క్వింటాళ్ల

వరకు దిగుబడి!

తెలుగు రాష్ట్రాల్లో నూనె గింజల పంటల్లో నువ్వులు ఒకటి. తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో అంది వచ్చే నూనె గింజల పంటల్లో నువ్వుల సాగు మేలైనది. ఖరీఫ్‌లో వేసిన వివిధ పంటలను తొలగించాక, రెండో పంటగా డిసెంబర్‌ నెలాఖరు నుంచి జనవరి చివరి వరకు రైతులు ఈ పంట సాగు చేపట్టారు. తక్కువ పెట్టుబడి, తక్కువ వనరులతో నికర లాభాలందించే పంటగా నువ్వులకు గుర్తింపు ఉంది. కేవలం రెండు, మూడు తడులు మాత్రమే ఇస్తే సరిపోయే పంట కావడంతో, వేసవిలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఆరుతడి పంటగా వేసవిలో వేయడం వల్ల చీడపీడల బెడద చాలా తక్కువ. కరోనా సమయంలో నువ్వుల నూనెకు డిమాండ్‌ పెరగడంతో, ఇప్పుడు నువ్వుల పంటను భారీగా సాగు చేస్తున్నారు.

సాగు విస్తీర్ణం పెరిగింది

ఈ ఏడాది నువ్వుల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. గతంలో 100 ఎకరాలు కూడా ఉండని పంట, ఈ ఏడాది ఒక్క గొల్లప్రోలు మండలంలోనే 400 ఎకరాల వరకు వేశారు. ప్రస్తుతం ఎండలు బాగా ఉండడంతో పంట దిగుబడి పెరిగి, ఆదాయం బాగుంటుంది. ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు రైతులకు వివరిస్తున్నాం. నీటి వసతితో పెద్దగా పని లేకపోవడం వల్ల ఇతర పంటల కంటే పెట్టుబడి తక్కువ కావడంతో రైతులు ఎక్కువ మంది ఈ పంట సాగు చేశారు. పంట అన్నిచోట్లా ఆశాజనకంగా ఉంది.

– సత్యనారాయణ, వ్యవసాయ శాఖాధికారి, గొల్లప్రోలు

ఆశాజనకంగా ఉంది

అన్ని పంటలు పూర్తయ్యాక మామూలుగా విత్తనాలు చల్లి వదిలేసేవాళ్లం. ఇప్పుడు ఇదే ప్రధాన పంటగా వేశాం. ప్రస్తుతం మార్కెట్‌లో నువ్వులకు మంచి డిమాండ్‌ ఉంది. వాతావరణం కలిసి రావడంతో ఈ ఏడాది మంచి దిగుబడి వచ్చేలా కనిపిస్తోంది. పెట్టుబడి తక్కువ కావడంతో పాటు, ఆరుతడి పంట కావడం వల్ల రేగడి నేలల్లో మంచి అనుకూలమైన పంట కావడంతో దీనిని సాగు చేస్తున్నాం. ఆదాయం బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

– సోమిశెట్టి జగ్గారావు, నువ్వుల రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం

నువ్వులు.. రైతన్న మోములో నవ్వులు 1
1/1

నువ్వులు.. రైతన్న మోములో నవ్వులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement