సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. జిల్లాలో ఎక్కడికక్కడ పార్టీ జెండాలను నేతలు ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్సార్ సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రతి గ్రామంలోను ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులు సమష్టిగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నాయకులు దగ్గరుండి పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడలోని వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయంలో జిల్లా స్థాయిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఎన్నికల ప్రక్రియ
బలోపేతానికి సలహాలివ్వాలి
కాకినాడ సిటీ: ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అవసరమైన సలహాలు, సూచనలు ఈ నెల 31వ తేదీ నాటికి అందజేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో నూతన సంస్కరణలు తీసుకొచ్చే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి సూచనలు సలహాలు ఆహ్వానించిందన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, 1951, ఓటర్ల నమోదు నియమాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి వంటి అంశాలపై సూచనలు అందజేయవచ్చన్నారు. వచ్చిన సూచనలు, సలహాలపై భారతీయ ఎన్నికల సంఘం ఏప్రిల్ 30న అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చిస్తుందని కలెక్టర్ తెలిపారు.
టెన్త్ విద్యార్థులకు
ఉచిత బస్సు ప్రయాణం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకూ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. విద్యార్థులు వారి హాల్ టికెట్టు చూపించి, పరీక్ష తేదీల్లో ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జనసేన నాయకుడి
దాడిపై నివేదిక ఇవ్వండి
రాష్ట్ర బాలల హక్కుల
పరిరక్షణ కమిషన్ ఆదేశం
కరప: స్థానిక మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయం విద్యార్థులపై జనసేన పార్టీ నాయకుడు భోగిరెడ్డి గంగాధర్ దాడి చేసిన ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. ఈ నెల 4న గురుకుల విద్యాలయం విద్యార్థులపై గంగాధర్ పిడిగుద్దులతో దాడి చేయడం, బూటు కాలితో తన్నడంపై రెండు రోజులుగా పత్రికల్లో వస్తున్న వార్తలపై కమిషన్ చైర్మన్ కె.అప్పారావు, సభ్యురాలు టి.ఆదిలక్ష్మి స్పందించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి, నివేదిక ఇవ్వాలని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి (డీసీపీఓ) వెంకట్, ఐసీడీఎస్ సీడీపీఓ వై.లక్ష్మి, పీఓ ఎన్‌ఐసీ శ్రీనివాస్‌లను ఆదేశించారు. ఈ మేరకు ఆ అధికారులు మంగళవారం గురుకుల విద్యాలయానికి చేరుకుని, టెన్త్ విద్యార్థులను, సిబ్బందిని విచారించారు. ప్రిన్సిపాల్ కృష్ణారావు సమక్షంలో గంగాధర్, పోలీసు కానిస్టేబుల్‌తో కలసి వచ్చి తమపై దాడి చేసి, బూటు కాలితో తన్నాడని విద్యార్థులు చెప్పారు. విద్యార్థులను కొట్టడం చూశామని కొంత మంది సిబ్బంది చెప్పగా, చూడలేదని మరి కొంత మంది చెప్పారు. విచారణ అనంతరం సంబంధిత నివేదికను ఆయా అధికారులు కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారులకు అందజేశారని తెలిసింది.
నేడు వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
నేడు వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం