
చోరీ కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్టు
కాకినాడ రూరల్: మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 78 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక మోటార్ బైక్‌తో పాటు, సుమారు రూ.6.50 లక్షల విలువైన చోరీ సొత్తును కాకినాడ ఇంద్రపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ సోమవారం ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాకినాడ రూరల్ తూరంగి సత్యదేవనగర్ ప్రాంతానికి చెందిన గంపల సతీష్, కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన పట్టిం వరప్రసాద్ అనే అనుమానితుల్ని పోలీసులు అదుపులో తీసుకుని విచారించారు. వారు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో రెండు దొంగతనాలు, కరప, కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన దొంగతనం కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు గుర్తించారు. కాకినాడ రూరల్, పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచర్లపై నిఘా ఉంచి, తనిఖీలు చేస్తుండగా, సోమవారం కాకినాడ రూరల్ మండలంలోని ఇంద్రపాలెం గ్రామంలో ఉన్న ముసలమ్మ తల్లి గుడికి సమీపంలో ఇంద్రపాలెం ఎస్సై ఎం వీరబాబు, సిబ్బందితో వీరిని పట్టుకున్నామన్నారు. వారిని విచారణ చేయగా.. దొంగతనాల విషయం వెలుగు చేసినట్టు డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, వారికి రిమాండ్ విధించినట్టు తెలిపారు. సమావేశంలో కాకినాడ రూరల్ సీఐ డీఎస్ చైతన్యకృష్ణ, కాకినాడ క్రైమ్ సీఐ వి.కృష్ణ, ఇంద్రపాలెం ఎస్సై ఎం.వీరబాబు, ఏఎస్సైలు గోవిందు, పుల్లయ్య, పీసీలు పాల్గొన్నారు.
రూ.6.50 లక్షల సొత్తు స్వాధీనం
డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ వెల్లడి