విద్యార్థులను నిపుణులుగా చేయడమే లక్ష్యం
రాజానగరం: నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందిస్తూ, వారిని ప్రపంచంలో తిరుగులేని నిపుణులుగా తయారు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) అన్నారు. జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీలతో కలసి అనువర్తనాలపై జీజీయూ శుక్రవారం జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావాన్ని ప్రొ. చాన్సలర్ కె.శశికిరణ్‌వర్మ వివరించారు. సాంకేతిక పరిజ్ఞాన్ని పెంపొందించుకోవడంలో ఏఐ టూల్స్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. సాంకేతిక విద్యలో ఏఐ విప్లవాత్మక మార్పులను బెంగళూరుకు చెందిన కరిష్మా కార్పొరేషన్ చైర్మన్, సీఈఓ, ఇండో – అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రాజ్ మృత్యుంజయప్ప వివరించారు. ఆటోమొబైల్ రంగంలో ఏఐ అన్వయాలు, వినియోగాల గురించి కాంటినెంటల్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ ప్రశాంత్ దొరస్వామి తెలియజేశారు. జీజీయూ వీసీ యు.చంద్రశేఖర్ ఆధ్వర్యాన ప్యానల్ డిస్కషన్ నిర్వహించారు. ఏఎంఎస్ ఇండియా సీఈఓ ఎన్‌సీ శశిధర్ కూడా ప్రసంగించారు. కార్యక్రమానికి బి.సుజాత, ఆర్.తమళకోడి, కె.వల్లీ మాధవి కన్వీనర్లుగా వ్యవహరించారు.
పోలవరం కాలవలో పడి
వివాహిత ఆత్మహత్య
జగ్గంపేట: భర్త సినిమాకి తీసుకువెళ్లలేదని అలిగి రెండు రోజులు క్రితం అదృశ్యమైన వివాహిత జగ్గంపేటలోని పోలవరం కాలవలో శవమైతేలింది. సీఐ వైఆర్‌కే శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం జగ్గంపేట సత్యవేణి పేటకు చెందిన వెలుగుల వీర దుర్గాప్రసాద్ భార్య ఏసమ్మ (22) రెండు రోజుల క్రితం నుంచి కనిపించటలేదని తెలిపారు. అయితే ప్రతి చిన్న విషయానికి కోపగించే ఏసమ్మ ఈ నెల 6వ తేదీన భర్తను సినిమాకి తీసుకుని వెళ్లమని కోరడం, టైం అయిపోవడంతో తరువాత వెళదామని భర్త చెప్పడంతో ఆమె కోపగించి ఎటో వెళ్లిపోయిందని తెలిపారు. అయితే ఆమె కోపగించి రెండురోజుల పాటు బంధువుల ఇళ్లకు వెళ్లడం తిరిగి రావడం సర్వసాధారణమేనని భావించి భర్త, ఆమె పుట్టింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే శుక్రువారం ఉదయం జగ్గంపేట డిగ్రీ కాలేజీ సమీపంలో పోలవరం కాలవలో ఒక మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళ మృతదేహం ఏసమ్మదిగా ఆమె తల్లి, భర్త గుర్తించారు. ఏసమ్మకు 2021లో జె.తిమ్మాపురం గ్రామానికి చెందిన వీరబాబుతో వివాహమై ఏడాది కాకుండానే విడాకులు తీసుకున్నారు. తరువాత జగ్గంపేటకు చెందిన దుర్గాప్రసాద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మృతురాలి తల్లి నక్కా వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఎస్సై రఘునాథరావు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీనివాసరావు వివరించారు.
విద్యార్థులను నిపుణులుగా చేయడమే లక్ష్యం


