
‘స్వర్ణాంధ్ర–2047’కు కృషి చేయండి
కాకినాడ సిటీ: స్వర్ణాంధ్ర–2047 విజన్‌కు సంబంధించి జిల్లా, మండల కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి ఆయన కాకినాడ నగర కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్వర్ణాంధ్ర–2047 విజన్‌కు సంబంధించి జిల్లా కార్యాచరణ ప్రణాళికను అక్టోబరు 15 నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో చేర్చాల్సిన ప్రధాన అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ నేపథ్యంలో తొలుత మండల, మున్సిపల్ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికను ఈ నెల 30 నాటికి రూపొందించాలన్నారు. ఇందుకు గ్రామ సభలు నిర్వహించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రానున్న ఐదేళ్ల కాలంలో విజన్ ప్లాన్‌కు నివేదిక సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ప్రతి శాఖ స్వర్ణాంధ్ర–2047 విజన్ లక్ష్యసాధనలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పరిశ్రమలు, మానవ వనరులు, వైద్య, విద్యా విధానం, నైపుణ్య అభివృద్ధి వంటి అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.