
● సత్యదేవుని దర్శించిన
80 వేల మంది భక్తులు
● దేవస్థానానికి రూ.80 లక్షల ఆదాయం
● 8 వేల వ్రతాల నిర్వహణ
అన్నవరం: రత్నగిరి ఆదివారం జనసంద్రమే అయ్యింది. తెల్లవారుజాము నుంచీ వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, దర్శనం క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారి ఆలయాన్ని తెల్లవారుజామున మూడు గంటలకు తెరచి సత్యదేవునికి పూజలు చేశారు. అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. వ్రతాలు కూడా వేకువజామున మూడు గంటలకే ప్రారంభించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకూ దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాన్ని నిలిపివేశారు. అందరినీ వెలుపల నుంచే అనుమతించారు. యంత్రాలయంలో కూడా ప్రదక్షిణ దర్శనాలు నిలిపివేశారు. సుమారు 80 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి, పూజలు చేశారు. వ్రతాలు 8 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.80 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. అన్నదాన పథకంలో 10 వేల మంది భక్తులకు భోజనం పెట్టారు. కార్తిక మాసం ఆఖరి సోమవారం కావడంతో రత్నగిరిపై నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగనుంది. భక్తులు భారీగా తరలి వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే సత్యదేవుని వ్రతాలు, దర్శనాలకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రత్నగిరిపై అనివేటి మండపంలో సహస్ర జ్యోతిర్లింగార్చన నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకూ 1.18 లక్షల వ్రతాలు
ప్రస్తుత కార్తిక మాసంలో ఇప్పటి వరకూ సత్యదేవుని వ్రతాలు 1.18 లక్షలు జరిగాయి. గత ఏడాది ఇదే రోజుకు 1,41,647 వ్రతాలు జరిగాయి. ఈ ఏడాది సుమారు 23 వేల వ్రతాలు తక్కువగా జరిగాయి. మంగళవారంతో కార్తిక మాసం ముగియనుంది.
ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ