
కరాటే పోటీలను ప్రారంభిస్తున్న మల్లికార్జున్‌గౌడ్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు
సామర్లకోట: కరాటేకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతుందని కరాటే అసోసియేషన్ ఇండియా చీఫ్, తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి కె.మల్లికార్జున గౌడ్, లయన్స్ క్లబ్ మొదటి జిల్లా గవర్నర్ ఈదల ఈశ్వరకుమార్, భారతమాత సేవా పరిషత్తు అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్య దొర అన్నారు. సామర్లకోట డీఎన్‌ఆర్ ఫంక్షన్ హాలులో ఆదివారం జాతీయ స్థాయి కరాటే పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామర్లకోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పదేళ్లుగా కరాటే పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు చిత్తూలూరి వీర్రాజు మాట్లాడుతూ పోటీల్లో తొమ్మిది రాష్ట్రాలు తలపడ్డాయన్నారు. ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్లుగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలు నిలిచాయి. ద్వితీయ స్థానాన్ని ఆంధ్ర, తృతీయ స్థానాన్ని కర్ణాటక కై వసం చేసుకున్నాయి. వ్యక్తిగత చాంపియన్ బాలికల విభాగంలో తెలంగాణ, పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ కై వసం చేసుకున్నాయి. విజేతలకు ఈదల ఈశ్వరకుమార్, మల్లికార్జునరావు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కరాటే కోచ్ డి.శంకరరావు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ చిత్తూలూరి శ్రీదేవి, జోన్ చైర్మన్ మద్దిరాల శివనాగకృష్ణ, స్థానిక క్లబ్ చైర్మన్ కానుబోయిన విజయకృష్ణ, కార్యదర్శి కె.ప్రసాద్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.