సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిన్న మొన్నటి వరకూ మండిపోయిన ఎండలు, వడగాడ్పులకు తాళలేక వినియోగదారులు ఎడాపెడా విద్యుత్ వాడేశారు. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు 24/7 వినియోగించినా ఉపశమనం లభించక నరకయాతన పడ్డారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో ఆ మేరకు బిల్లులు కూడా వినియోగదారుల గుండెల్ని గుభేల్‌మనిపించాయి. అటువంటిది జూన్ నెలాఖరు వచ్చేసరికి నైరుతి ప్రవేశంతో వాతావరణం చల్లబడింది. ఫలితంగా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం తగ్గింది. దీంతో విద్యుత్ డిమాండ్ కూడా తగ్గింది. జూలై వచ్చేసరికి మరింత తగ్గుదల నమోదైంది.
నాలుగు నెలలు డేంజర్ బెల్స్
ఈ ఏడాది వేసవి మొత్తం నాలుగు నెలలు డేంజర్ బెల్స్ మోగించింది. మార్చిలో ఎండలు మొదలయ్యాయి. జూన్ నెలాఖరు వరకూ ఎక్కడా తగ్గేదే లే.. అన్నట్టుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఒక్క మే నెలలోనే అధికారులే ఊహించని రీతిలో విద్యుత్ వినియోగం నమోదైంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మొత్తం మీద విద్యుత్ వినియోగంలో కాకినాడ డివిజన్ 202 మిలియన్ యూనిట్ల(ఎంయూ)తో అగ్రస్థానంలో నిలిచింది. 110 ఎంయూల వినియోగంతో రాజమహేంద్రవరం, 104 ఎంయూలతో అమలాపురం డివిజన్లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో మామూలుగా రూ.600 నుంచి రూ.800 వచ్చిన నెలవారీ విద్యుత్ బిల్లు ఏకంగా రూ.2 వేలు, రూ.3 వేలకు పైగా పెరిగిపోయింది. ప్రస్తుతం వాతావరణం చల్లబడి, విద్యుత్ వినియోగం తగ్గడంతో ఈసారి వచ్చే బిల్లులు తగ్గే అవకాశం ఉంది.
జూన్‌లో రికార్డు స్థాయి వినియోగం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వేసవి మొత్తం చూసుకుంటే.. జూన్ నెలలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో ఏకంగా 613.27 ఎంయూల బెంచ్ మార్క్‌ను దాటేసింది. గత ఏప్రిల్ నుంచి సరాసరి రోజుకు 20 నుంచి 23 ఎంయూల విద్యుత్ వినియోగం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా అంతా కలిపితే రోజుకు సగటున 20 ఎంయూల విద్యుత్ వినియోగిస్తున్నారు. ఇది క్రమంగా తగ్గుతూ రానున్న రోజుల్లో రోజుకు 17 లేదా 18 ఎంయూలకు మించి ఉండదని చెబుతున్నారు. ఎండలు తగ్గి వాతావరణం చల్లబడటంతో ప్రస్తుత నెలలో సగం రోజుల వినియోగం 280 మిలియన్ యూనిట్లు ఉంది. ఈ నెలలో మిగిలిన 15 రోజులూ వాతావరణం మరింత చల్లబడుతుందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో వినియోగం ఇంతకంటే తక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెలాఖరుకు వినియోగం 150 ఎంయూలే ఉండవచ్చని విద్యుత్ అధికారులు భావిస్తున్నారు. అంటే ఈ నెల మొత్తం 430 ఎంయూల విద్యుత్ మాత్రమే వినియోగమయ్యే అవకాశం ఉంది. వేసవిలో నమోదైన నెలవారీ వినియోగంతో పోలిస్తే ఇక నుంచి నెలవారీ కనీసం 150 నుంచి 170 మిలియన్ యూనిట్ల వినియోగం తగ్గుతుందని ఏపీ ఈపీడీసీఎల్ అంచనా వేస్తోంది. ఆగస్టు వచ్చేసరికి ఇది మరింత తగ్గనుంది.
వినియోగం మరింత తగ్గుతుంది
వేసవిలో రోజూ సగటున 22 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండేది. ప్రస్తుతం వర్షాలు కురుస్తూండటంతో వినియోగం తగ్గింది. ముఖ్యంగా గృహ విద్యుత్ వినియోగం బాగా తగ్గింది. ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతటా కలిసి 18 మిలియన్ యూనిట్లు వినియోగిస్తున్నారు. శీతాకాలం వచ్చేసరికి ఇది 14 మిలియన్ యూనిట్లకు తగ్గుతుందని అంచనా వేస్తున్నాం.
–టీవీఎస్‌ఎన్ మూర్తి, ఎస్‌ఈ,
ఏపీ ఈపీడీసీఎల్, రాజమహేంద్రవరం సర్కిల్
ఫ్యాన్ వేసుకునే అవసరం కూడా రావడం లేదు
ఎండాకాలంలో ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం నుంచే ఏసీ వేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం వర్షాలు కురవడంతో వాతావరణం చాలా చల్లగా ఉంటోంది. ఏసీ కాదు, కనీసం ఫ్యాన్ కూడా వేసుకునే అవసరం కూడా లేని పరిస్థితి. విద్యుత్ వినియోగం తగ్గింది. బిల్లు కూడా తగ్గుతుంది.
– కె.దొరబాబు, వినియోగదారుడు, కాకినాడ
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విద్యుత్ వినియోగం వివరాలు
నెల వినియోగం ఒక రోజు బిల్లు డిమాండ్ వసూళ్లు
ఎంయూ గరిష్ట వినియోగం (రూ.కోట్లలో) (రూ.కోట్లలో)
(ఎంయూ)
ఏప్రిల్ 559.14 20.46 289.50 260.00
మే 577.79 23.03 372.12 299.34
జూన్ 613.27 23.03 397.82 376.79
ఉమ్మడి జిల్లాలో
విద్యుత్ కనెక్షన్ల వివరాలు
మొత్తం వినియోగదారులు 19,27,679
గృహ వినియోగదారులు 16,32,042
కేటగిరీ–2 1,90,302
వ్యవసాయ కనెక్షన్లు 51,605
ఆక్వా కనెక్షన్లు 10,002
పరిశ్రమలు 6,324
వీధి దీపాలు 37,304
ఉమ్మడి జిల్లాలో ఏపీ ఈపీడీసీఎల్
డివిజన్ల వారీగా విద్యుత్ వినియోగం
(ఎంయూలలో)
కాకినాడ 202
రాజమహేంద్రవరం 110
అమలాపురం 104
రామచంద్రపురం 80
జగ్గంపేట 66
రంపచోడవరం 10
విద్యుత్ వినియోగంపై నైరుతి ఎఫెక్ట్
వాతావరణం చల్లబడటంతో
తగ్గిన వినియోగం
పక్షం రోజుల్లో 280 ఎంయూలే వాడకం
నాలుగు నెలలుగా
500 నుంచి 550 ఎంయూలు
నెలాఖరుకు 150 ఎంయూకు
తగ్గుతుందని అంచనా


