రాజోళి: అసలే కరువు పరిస్థితులు.. ఆపై తీవ్రమైన కరెంట్ కోతలతో అరకొరగా సాగు చేసిన పంటలు ఎండిపోతున్నా అధికారులకు పట్టడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మాన్‌దొడ్డి, నసనూరు, చిన్నధన్వాడ, పెద్దధన్వాడ, నౌరోజీ క్యాంపు తదితర గ్రామాల రైతులు గురువారం ఉదయం మాన్‌దొడ్డి సబ్‌స్టేషన్ వద్దకు చేరు కుని నిరసన తెలిపారు. రోజులో ఎన్నిసార్లు కరెంట్ తీస్తున్నారో తెలియక సతమతమవుతున్నామని, వ్యవసాయానికి ఇచ్చే సరఫరాలో నిత్యం కోతలే ఉండటంతో పంటలకు తడులు అందించలేపోతున్నామని వాపోయారు. ఇప్పటికే పంటలు ఎండు దశకు చేరిన క్రమంలో వాటిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నామని, కరెంట్ అధికారులకు మాత్రం అది పట్టడం లేదన్నారు. ప్రస్తుతం తడులు అందితే పంటలకు బలమని చెప్పినా కరెంట్ కోతలు మాత్రం ఆగడం లేదని వాపోయారు. ఏ సమయంలో సప్లయ్ ఉంటుంది.. ఎప్పుడు కట్ చేస్తారు.. మళ్లీ ఎప్పుడు వస్తుందో చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అధికారుల తీరు ఇలాగే కొనసాగితే గ్రామ గ్రామాన రైతులు విద్యుత్ కార్యాలయాలను ముట్టడిస్తారని, రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కోతలు తగ్గించి సక్రమంగా సరఫరా చేయాలని కోరారు.


