రాజోళి/ ఉండవెల్లి: గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. గురువారం వడ్డేపల్లి మహిళా సమాఖ్యలో అలంపూర్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించి మాట్లాడారు. పాంపాండ్ల పురోగతి, లేబర్ బడ్జెట్, నివేదికలు, ఎస్టిమేషన్ల తయారీ తదితర పనులపై మండలాల వారీగా అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. లేబర్ బడ్జెట్‌కు అనుగుణంగా పనులు నిర్వహించాలని, నిత్యం పనులపై పర్యవేక్షణ చేస్తూ.. నాణ్యతగా చేపట్టేలా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని అప్పుడే పనులు వేగవంతంగా సాగుతాయని చెప్పారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై నివేదిక అందించాలని సూచించారు. అనంతరం వడ్డేపల్లిలో జరుగుతున్న పలు పనులను ఆయన పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అలాగే ఉండవెల్లిలో రైతు నిర్మిస్తున్న పాంపాండును పరిశీలించారు. తప్పనిసరిగా వీఓ పాంపాండ్లను నిర్మించాలని పేర్కొన్నారు.


