సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రబీ సీజన్ 2022–23లో వేలం వేసి న సీఎమ్మార్ ధాన్యంలో అక్రమాలు నివ్వెరపరుస్తున్నాయి. ఉమ్మడి పాలమూ రులో రూ.వెయ్యి కోట్లకు పైగా సర్కారు పెట్టుబడిని రైస్ మిల్లర్లు పక్కా పథకం ప్రకారమే అప్పనంగా కాజేశారు. రూ.కోట్లు విలువైన సీఎమ్మార్ ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందాల తనిఖీల్లో బట్టబయలు కాగా.. ఈ బాగోతం వెనుక ఎవరెవరున్నారనే దానిపై సర్కార్ దృష్టిపెట్టింది. ఈ దందాలో సూత్రధారులు, పాత్రదారులపై ఉన్నతాధికారులు కూపీ లాగుతుండగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
మామూళ్లతో కట్టిపడేసి..
2022– 23 రబీకి సంబంధించిన ధాన్యాన్ని ఆయా జిల్లాల్లో అసోసియేషన్ పేరిట మిల్లర్లందరూ కుమ్మకై ్క ప్రభుత్వానికి తిరిగి బియ్యం ఇవ్వకుండా పెద్దఎత్తున దారి మళ్లించారు. సివిల్ సప్లయ్ శాఖలోని పలువురు అధికారులు, సిబ్బందిని మామూళ్లతో మచ్చిక చేసుకొని.. దందా సాగించినట్లు తెలుస్తోంది. ముందుగా తమకు కేటాయించిన ధాన్యంలో కొంతమేర పాడై పోయేలా చేసిన మిల్లుల నిర్వాహకులు.. త్రిముఖ వ్యూహంతో నాటకాలకు తెరలేపారు.
ఎండకు ఎండి.. వానకు తడిసి
తొలుత మిల్లులకు కేటాయించిన ధాన్యంలో కొన్ని బస్తాలను ఆవరణలో ఎలాంటి రక్షణ లేకుండా నెట్టు వేయించారు. ఎక్కువ మొత్తంలో బస్తాలను షెడ్డులో వేశారు. ఆవరణలో వేసిన బస్తాలపై టార్పాలిన్లు లేకుండా, ఉన్నా కప్పీకప్పకుండా, చిరిగిన వాటిని కప్పి కావాలనే వర్షానికి తడిసి.. ఎండకు ఎండేలా చేశారు. ఆ తర్వాత ధాన్యం పూర్తిగా పాడైంది.. మేం వాడుకోలేదు.. బకాయి డబ్బులు కట్టమని అధికారులకు తెలియజేస్తున్నట్లు నటించి.. క్రమంగా మిగతా ధాన్యాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడతో ముందుకెళ్లినట్లు విచారణలో గుర్తించారు. ఆ తర్వాత నాణ్యత లేని ధాన్యం ఇథనాల్, లిక్కర్ ఫ్యాక్టరీలకు ముడిసరుకుగా బ్రోకెన్ రైస్ ఉపయోగపడుతుండడంతో నూకలుగా మార్చి తరలించేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.
సర్కారు సీరియస్
2022– 23లో అదనంగా సీఎమ్మార్ ధాన్యం కట్టబెట్టారని.. అకాల వర్షాలతో తడిచి పాడైందంటూ మిల్లర్లు ఇంకా బురిడీ కొట్టించే ప్రయత్నమే చేస్తు న్నారు. ప్రభుత్వం డబ్బులు కట్టాల్సిందేనంటూ స్ప ష్టం చేసినప్పటికీ.. కొందరు మిల్లర్లు అదే ఎత్తుగడ తో ముందుకు సాగుతుండడం పెద్దలకు మరింత ఆగ్రహం తెప్పించింది. అందుకే జిల్లాలు, మిల్లర్ల వారీగా చిట్టా తెప్పించుకొంటుండగా.. అసలు నిజా లు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విజిలెన్స్ ఆకస్మిక దాడులు.. కేసుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలువురు మిల్లర్లు భయంతో హైదరాబాద్‌లోనే మకాం వేసి.. పైరవీలు మొదలుపెట్టారు. ముందస్తు బెయిల్ కోసం కొందరు ప్రయత్నిస్తుండగా.. తనిఖీలు ఆపాలని మరికొందరు మంత్రులు, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం.
ఆ మిల్లుపై ఎనలేని ప్రేమ..
ఉమ్మడి జిల్లాలో విజిలెన్స్ బృందాలు ఇటీవల వరుసగా 14కిపైగా మిల్లులను జల్లెడ పట్టి దాదాపు రూ.245.10 కోట్ల అక్రమాలను బహిర్గతం చేశాయి. నవాబుపేట తీగలపల్లిలోని శ్రీ కనకదుర్గ పారాబాయిల్డ్ రైస్‌మిల్లు, మహబూబ్‌నగర్, వనపర్తి, ఖిల్లాఘనపురం, పెబ్బేరు, కొత్తకోట, కేటీదొడ్డి తదితర ప్రాంతాల్లో నిల్వ వ్యత్యాసాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. అయితే హన్వాడ మండలం ఇబ్రహీంబాద్‌లోని శ్రీలక్ష్మీ బాలాజీ రైస్ మిల్లులో 2022–23 రబీకి సంబంధించి రూ.11.34 కోట్ల విలువైన 5,070 మె.ట., ధాన్యం పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ తనిఖీల్లో తేలగా.. సదరు మిల్లు నిర్వాహకుడిపై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
2022– 23 రబీ
సీఎమ్మార్‌లో మిల్లర్ల నాటకాలు
అసోసియేషన్ పేరిట కుమ్మకై ్క త్రిముఖ వ్యూహం..
కావాలని కొంత మేర ధాన్యం పాడైపోయేలా చేసి తొండాట
నాణ్యతది మర ఆడించి యథేచ్ఛగా మార్కెట్‌లో విక్రయం
అప్పనంగా సొమ్ము చేసుకుని.. నష్టమంటూ దొంగ కన్నీళ్లు


