గద్వాల న్యూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనది చేయూత పథకం. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన, ఆదరణ లేని వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత కార్మికులకు ప్రతినెలా రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున ప్రతినెలా ఆర్థికసాయం అందిస్తున్నారు. అయితే కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి నాలుగేళ్లుగా దరఖాస్తులను స్వీకరించలేదు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో అర్హులైన పేదల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. చేయూత పింఛన్ల కోసం జిల్లావ్యాప్తంగా దరఖాస్తులు దండిగా వచ్చాయి. థర్డ్ పార్టీ ద్వారా విచారించి.. అర్హులను ఎంపిక చేయనున్నారు.
నాలుగేళ్లుగా దూరం..
చేయూత పథకానికి అర్హులైన వారు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ.. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నాలుగేళ్ల నుంచి కొత్త వాటిని మంజూరు చేయలేదు. వృద్ధుల్లో భర్తకు పింఛన్ ఉండి మరణిస్తే.. ఆయన స్థానంలో భార్యకు, లేదా భార్యకు ఉండి ఆమె మరణిస్తే.. భర్తకు మాత్రమే స్పౌజ్ కింద మంజూరు చేస్తున్నారు. మిగిలిన ఏ విభాగాల్లోనూ కొత్తగా పింఛన్లు మంజూరు చేయలేదు. కొత్త పింఛన్లు మంజూరు లేకపోవడంతో చాలా మంది అర్హులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా దివ్యాంగులకు పుట్టుకతో అంగవైకల్యం ఉంటేనే పర్మినెంట్ సదరం సర్టిఫికెట్ మంజూరవుతుంది. అలా కాకుండా ప్రమాదాలు, ఇతర కారాణాలతో వైకల్యం ఉంటే నిర్దిష్ట కాలపరిమితికి (2ఏళ్ల నుంచి 3ఏళ్లు) వర్తించేలా మాత్రమే సదరం సర్టిఫికెట్ ఇస్తారు. నాలుగేళ్లలో చాలా మందికి నిర్దిష్ట గడువుతో సదరం సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ కొత్త పింఛన్ మంజూరు కాకపోవడంతో ప్రభుత్వ సాయానికి దూరమయ్యారు. వీరితో పాటు ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, డయాలసిస్, ఫైలేరియా పేషెంట్లు ఆర్థిక అవస్థలు పడుతున్నారు.
థర్డ్ పార్టీ ద్వారా విచారణ?
దరఖాస్తులను ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. అయితే వీటిపై మరోసారి థర్డ్ పార్టీ ద్వారా విచారణ చేసి, కొత్త పింఛన్లు మంజూరుచేసే అవకాశం ఉంది. ప్రధానంగా దరఖాస్తుదారులకు ఉన్న అర్హత, కుటుంబ ఆర్థిక పరిస్థితి, వాహనాలు, భూమి తదితర అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. అయితే ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు.
దండిగా అర్జీలు..
జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం అన్ని విభాగాల కింద 66,968 మంది చేయూత లబ్ధిదారులు ఉన్నారు. ఒంటరి మహిళలు, వితంతులు, గీత, నేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు (తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా, బాధితులు) నుంచి ప్రభుత్వం గత ఆగస్టు 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలోని 13 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో 10,215 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పెంచిన నేపథ్యంలో వాటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఆసరా పింఛన్ల కోసం జిల్లాలో దరఖాస్తుల వెల్లువ
నాలుగేళ్లుగా అర్హుల ఎదురుచూపులు
మళ్లీ దరఖాస్తు గడువు పెంచిన ప్రభుత్వం
ఈ నెల 15 వరకు అవకాశం
ఇప్పటికే 10,215 మంది దరఖాస్తులు


