అలంపూర్ రూరల్: జిల్లాలో హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టిసారించి రెండు వారాల ముందే వారిని నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉంచాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి వరలక్ష్మి అన్నారు. మంగళవారం ఆమె మండలంలోని క్యాతూర్ పీహెచ్‌సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి.. రికార్డులను పరిశీలించారు. మండల వైద్యాధికారి రాధిక ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల సమీక్ష సమవేశం నిర్వహించారు. ఆరోగ్య శాఖకు సంబంధించి అమలవుతున్న జాతీయ, రాష్ట్రస్థాయి ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై ఆరాతీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి గర్భిణికి సురక్షితమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రనవాలన్నీ తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేయాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది, ఆశాలు పూర్తి సమన్వయంతో పనిచేసి.. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈఓ సత్యనారాయణ, హెచ్‌ఏ బాలీశ్వరయ్యశెట్టి, సూపర్‌వైజర్లు ఉలిగమ్మ, చంద్రన్న, ఎంఎల్‌హెచ్‌పీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్‌తో సామాజిక భద్రత ప్రశ్నార్థకం
గద్వాల న్యూటౌన్: పాత పెన్షన్ విధానం రద్దు చేసి.. సీపీఎస్ విధానం అమలు చేయడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్ సామాజిక భద్రత ప్రశ్నార్థకంగా మారిందని టీఎస్ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, సహ అధ్యక్షుడు విష్ణు అన్నారు. సీపీఎస్ అమలై 22 ఏళ్లు అవుతున్నా.. ఓపీఎస్‌ను పునరుద్ధరించకపోవడాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయులు మంగళవారం నల్లబ్యాడ్జీలు, రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఇందులో భాగంగా భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో నవంబర్ 17న సామూహిక సెలవులకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నవంబర్ 17నే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించి.. సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తామని చెప్పారన్నారు. దీనినే మేనిఫెస్టో డేగా పాటిస్తూ.. సామూహిక సెలవు కార్యక్రమాన్ని అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయ వంతం చేయాలని కోరారు. 2004లో ప్రవేశపెట్టిన సీపీఎస్ విధానంతో 22 ఏళ్లుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమలో నాయకులు శ్రీనివాసరెడ్డి, రమేష్‌కుమార్, బుచ్చన్న, లక్ష్మీనారాయణ, ప్రతాప్, రాజుసాగర్, తిమ్మన్న పాల్గొన్నారు.


