గద్వాల: నడిగడ్డలో బలిసినోడిదే రాజ్యం అని మరోసారి రుజువైంది. గద్వాల పట్టణం నడిబొడ్డులో భీంనగర్‌లో ఉన్న పదిశాతం స్థలంలో అక్రమంగా చేపడుతున్న ఆక్రమణదారుడు పనులు ఆపేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా నోటీసులకు భయపడం.. దమ్ముంటే కట్టడాన్ని ఆపండి అని ఎదురుదాడి చేశాడు. దీంతో బిక్కమొఖం వేసుకుని అధికారులు తలదించుకుని వెనుదిరిగి వచ్చారు. ఇదే సామాన్యుడిది అయ్యి ఉంటే వెంటనే పోలీసులను రంగంలోకి దింపి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేవారు. సదరు ఆక్రమణదారుడి బెదిరింపులకు భయపడి అధికారులు వెనుదిరగడం హాట్‌టాపిక్‌గా మారింది.
ఇదీ అసలు కథ..
జిల్లాకేంద్రంలోని భీంనగర్‌కాలనీలో అక్రమ నిర్మాణం చేపడుతున్న స్థలం పూర్తిగా పదిశాతం స్థలం. గతంలో ఇది వ్యవసాయ భూమిగా ఉండగా.. కాలక్రమేణా పట్టణం విస్తరించే క్రమంలో సదరు భూ యజమాని వ్యవసాయ భూమిని కాస్త రియల్ ఎస్టేట్ మార్చేసి అక్కడ ప్లాట్లు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో నిబంధనల మేరకు మున్సిపాలిటీకి పదిశాతం స్థలాన్ని వదిలిపెట్టాల్సి ఉండగా.. అక్కడున్న వ్యవసాయ బావితోపాటు పక్కన కొంతమేర ఖాళీ స్థలం కలుపుకొని పదిశాతం స్థలంగా మున్సిపాలిటీకి అప్పగించారు.లిదిలా ఉండగా అయితే పట్టణం విస్తరించడంతోపాటు జిల్లాకేంద్రంగా ఆవిర్భవించడంతో పదిశాతం స్థలంపై కన్నేసిన సదరు ఆక్రమణదారులు కొద్దికొద్దిగా వ్యవసాయ బావిని మట్టితో పూడ్చివేస్తూ.. ఈ స్థలం మాదేనంటూ బోర్డు సైతం పాతారు. అప్పట్లో దీనిపై విచారణ జరిపిన మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీ పదిశాతం స్థలం అని కోర్టులో నిరూపించి హక్కులు సాధించారు. అయితే ఇంత చేసిన అధికారులు పదిశాతం స్థలానికి రక్షణ కంచె ఏర్పాటు చేయలేకపోయారు.
లీజుకు సైతం ఇచ్చి..
ఇదిలా ఉండగా గత రెండు, మూడేళ్లుగా ఆ స్థలం చుట్టూ ఆక్రమణదారులు బండలతో కంచె వేసుకుని, చదును చేసుకున్నారు. అంతటితో ఆగకుండా సమీపంలోని వైద్యశాలలకు సంబంధించి పార్కింగ్ స్థలం కింద కూడా లీజుకు ఇచ్చారు. తర్వాత నాలుగు నెలల కిందట గుట్టుచప్పుడు కాకుండా పెద్దఎత్తున షాపింగ్ కాంప్లెక్స్, భవన నిర్మాణాలు చేపట్టాలని పావులు కదిపారు. మున్సిపాలిటీలో తమకున్న పలుకుబడితో అక్రమ మార్గంలో నిర్మాణాలకు సంబంధించి అనుమతులు సైతం సాధించారు. ఆ తర్వాత మే నెలలో మున్సిపల్ అనుమతులు ఉన్నాయని ధైర్యంగా నిర్మాణ పనులు మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా పదిశాతం స్థలం వ్యవహారం బయటకు వచ్చింది. ఇదే విషయాన్ని మే నెలలోనే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా.. దీనిపై కౌన్సిలర్ కామ్లీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే మున్సిపల్ అధికారులు సదరు అక్రమ నిర్మాణదారుడుకి నోటీసులు ఇచ్చి పనులు ఆపేశారు.
నా తడాఖా చూపిస్తా..
ఇదే విషయమై కౌన్సిలర్ కామ్లీ మరోసారి అధికారులకు ఫిర్యాదు చేస్తూ గట్టిగా నిలదీశాడు. దీంతో గురువారం మున్సిపల్ అధికారులు సదరు అక్రమ నిర్మాణం చేపడుతున్న వ్యక్తికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా మీ నోటీసులకు బెదిరేది లేదు. నాకు అధికార పలుకుబడి ఉంది. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. దమ్ముంటే నిర్మాణ పనులు కూల్చేయండి. అప్పుడు నా తడాఖా ఏంటో మీకు చూపిస్తా’ అంటూ బెదిరింపులకు దిగినట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది.
ముడుపులు అప్పజెప్పి..
ఇలా పనులు ఆపేసిన క్రమంలో అక్రమ నిర్మాణం చేపడుతున్న సదరు వ్యక్తి పలుకుబడి గల నాయకుడిని ఆశ్రయించారు. మధ్యవర్తుల ద్వారా బేరసారాలు నెరిపి.. సుమారు రూ.40 లక్షలకుపైనే ముడుపులు ముట్టజెప్పినట్లు పట్టణంలో ప్రచారం సాగుతుంది. ప్రచారానికి బలాన్ని చేకూర్చే తరహాలో పనులు ఆపేసిన సదరు వ్యక్తి తిరిగి పనులు మొదలుపెట్టారు.
నోటీసులకు భయపడం.. దమ్ముంటే కూల్చేయండి
మున్సిపల్ అధికారులపై
అక్రమార్కుల ఎదురుదాడి
నిస్సహాయంగా వెనుదిరిగిన సిబ్బంది
హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు
ఇటు అక్రమార్కులు, అటు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు


