అలంపూర్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అధికారులను ఆదేశించారు. అలంపూర్‌లోని హరిత టూరిజం హోటల్, ప్రసాద్ స్కీం భవనం, జోగుళాంబ రైల్వేస్టేషన్‌ను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. సోమవారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అలంపూర్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ ముందుగా అలంపూర్ చౌరస్తా సమీపంలోని బాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. అమృత్ భారత్ స్టేషన్స్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి పరిశీలించనున్నట్లు వెల్లడించారు. స్టేషన్‌లో ప్రయాణికుల హాల్, టికెట్ కౌంటర్, ఇతర విభాగాలను పరిశీలించి.. అభివృద్ధి పనులు, స్టేషన్ ద్వారా రాకపోకలు సాగించే రైళ్ల వివరాలను అసిస్టెంట్ రైల్వే డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో డబ్లింగ్ పనులకు సంబంధించిన భూ సేకరణ పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం అలంపూర్‌లోని హరిత హోటల్‌ను, ప్రసాద్‌స్కీం పథకంలో భాగంగా నిర్మించిన భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. అందులో అన్నప్రసాద కేంద్ర నిర్వహణపై ఆరా తీసి.. భక్తులకు రుచికరమైన భోజనం అందించాలన్నారు. ఆలయాల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సౌండ్స్ అండ్ లైట్స్ ప్రదర్శనను కేంద్రమంత్రి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు పర్షవేది, వినోద్‌కుమార్, విక్రమ్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీఓ చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ రాజేష్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
అలంపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ 22ఏ కింద వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. సర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కానీ, ఇతర ఓటర్లకు నోటీసుల పంపిణీ, హియరింగ్ ప్రక్రియలపై సంబంధిత అధికారులతో చర్చించారు.


