ఎలాంటి సమాచారం లేదు..
జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద
● వరి సాగుకు సన్నద్ధమవుతున్న
ఆయకట్టు రైతులు
● ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో
85 వేల ఎకరాల ఆయకట్టు
● నీటి విడుదలపై
స్పష్టత లేదంటున్న అధికారులు
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు రెండ్రోజులుగా ఎగువ నుంచి వరద చేరుతుండటంతో ఆయకట్టు రైతుల్లో సాగు ఆశలు చిగురించాయి. కాల్వలకు ఎలాగైనా నీటిని వదులుతారని వరి నారుమడులు సిద్ధం చేసుకోవడంతో పాటు పొలాలు దుక్కిదున్ని చదును చేసే పనులకు సిద్ధమయ్యారు. యాసంగిలో కేవలం 25 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందడంతో.. ఈ ఏడాది వానాకాలంలో పూర్తి ఆయకట్టు 85 వేల ఎకరాలకు సాగునీరు వదులుతారని ఆశించారు. ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు కురవకపోవడం.. ప్రాజెక్టుకు సకాలంలో వరద చేరకపోవడంతో ఆశలు వదులుకున్నారు. కాగా ఆయకట్టు పరిధిలో అక్కడక్కడ బోరుబావులున్న రైతులు వరి నారుమడులు వేసుకున్నారు. మిగిలిన రైతులు కాల్వ ద్వారా ఎప్పుడు నీరు వస్తుందోనని ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఎగువనున్న నారాయణపూర్ డ్యాం క్రస్ట్‌గేట్లు తెరిచి రెండోజ్రులుగా నీటిని వదలడంతో జూరాలకు 18,300 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
వరి సాగుకే ప్రాధాన్యం..
జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో ఈసారి సన్నరకం వరి సాగుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్‌లో సన్నరకాలకు మాత్రమే డిమాండ్ ఉండటం, ప్రభుత్వం కూడా 7 రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ప్రకటించడంతో రైతులు సన్నరకం వరిసాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఆయకట్టు పరిధిలో ఇలా..
జూరాల ప్రధాన ఎడమ కాల్వ ద్వారా అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లోని గ్రామాలకు సాగునీరు అందనుంది. వీపనగండ్ల వరకు 32 కిలోమీటర్ల పొడవునా కాల్వ ని ర్మాణం చేపట్టి డిస్ట్రిబ్యూటరీలను ఏర్పాటు చేసి నిర్దేశిత 85 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా కానుంది. అధికారులు ఆరుతడి పంటలకు మాత్రమే నీటిని అందిస్తామని ప్రకటించినా.. రైతులు మా త్రం కళ్లముందు నీరు పారుతుండటంతో తరి పంటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయకట్టు మొత్తంలో పండ్లు, చెరుకు తోటలు మినహాయించి సుమారు 55 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు.
ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఇప్పుడిప్పుడే ఎగువ నుంచి వరద వచ్చి చేరుతోంది. సాగునీటి విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. అధికారికంగా ఆదేశాలు వస్తే తప్ప సాగునీటి విడుదలపై స్పష్టత ఇవ్వలేం.
– షమీ ఉల్లా,
డీఈ, పీజేపీ నందిమళ్ల డివిజన్


