గద్వాల: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం మొదలైంది. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువకు వదలడంతో కృష్ణమ్మ పరవళ్లు ఆదివారం జూరాలకు చేరాయి. ఈ క్రమంలో ఎగువ నుంచి 33,900 క్యూసెక్కుల కొత్త నీరు వచ్చింది. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.356 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.710 మీటర్ల 5.653 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్‌నినో ప్రభావంతో వరిపంట సాగుపై ఆశలు వదులుకున్న రైతులు కృష్ణానదిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నేడు హుండీ లెక్కింపు
అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వా మి ఆలయాల్లోని హుండీని సోమవారం లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ, ధర్మాదా య శాఖ అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు.
మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
రాజోళి: గ్రామ పంచాయతీ కార్మికులకు అన్యాయానికి గురిచేస్తున్న మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్సింహ డిమాండ్ చేశారు. ఆదివారం రాజోళిలో పంచాయతీ కార్మికులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు కార్మికులకు సక్రమంగా వేతనాలను చెల్లించకపోవడంతో పాటు అదనపు పనిభారాన్ని మోపి, శ్రమ దోపిడీ చేస్తున్నారన్నారు. వారాంతపు సెలవులు కూడా ఇవ్వకుండా, పనులు చేయించడం సరైంది కాదన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డి.లక్ష్మన్న, తిక్కన్న, సౌల్‌రాజ్, మెహబూబ్ కృష్ణా, నరసన్న, రవి, రాజు ఉన్నారు.


