కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల వల్లే..
● మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్
మక్తల్/ కృష్ణా: కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న జలదోపిడిని అరికట్టకపోతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్‌ఎస్ బృందంతో కలిసి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా వారు కృష్ణానదిపై ఉన్న గూగల్ ప్రాజెక్టు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో దిగువకు వచ్చే నీరు తగ్గిపోతుందని, ప్రస్తుతం వర్షాలు తక్కువగా కురుస్తున్నందున తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచే చర్యలు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే జూరాలలో పూడిక పేరుకుపోవడంతో 11 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు. 33 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేందుకు ప్రాజెక్టు నిర్మిస్తే.. కేవలం 6 నుంచి 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతున్నామన్నారు. ఈ విషయం గ్రహించే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించి, ఎక్కడికక్కడ నీటిని నిల్వలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మక్తల్ ఎమ్మెల్యేగా చిట్టెం నర్సిరెడ్డి ఉన్న సమయంలో నియోజకవర్గంలో కృష్ణా, భీమానదులపై ఎత్తిపోతల పథకాలు నిర్మించారని, ప్రస్తుతం నదిలో నీళ్లులేక అవి మూతపడ్డాయన్నారు.
ఏడారిగా మారుతుంది..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా, భీమా నదులపై దివంగత ఎమ్మె ల్యే నర్సిరెడ్డి నిర్మించిన ఎత్తిపోతల ప్రాజెక్టులు నిరు పయోగంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం కొంతకాలంగా ఎగువన ఉన్న ప్రాజెక్టుల ఎత్తును పెంచడంతో పాటు కొత్తగా ఎక్కడపడితే అక్కడ బ్రిడ్జి కం బ్యారేజీలు నిర్మిస్తుందని, ఇదిలాగే కొనసాగితే త్వరలోనే ఉమ్మడి పాలమూరు ఎడారిగా మారుతుందని వాపోయారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో సాగునీటికి ఇబ్బందులు కలుగకుండగా తగు చర్యలు తీసుకోవాలని, కూసుమర్తి వద్ద బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మక్తల్, దేవరకద్ర, నారాయణపేట, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి,ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, నాయకులు శ్రీనివాస్‌గుప్తా, నర్సింహగౌడ్, మహిపాల్‌రెడ్డి, శివరాజ్‌పాటిల్, సంతోష్, సురేష్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ఈశ్వర్ పాల్గొన్నారు.


