చిన్నపాటి మరమ్మతులు చేస్తున్నాం..
రైతులకు ఎంతో ఊరట..
ఐడీసీ పరిధిలోకి ఎత్తిపోతల పథకాల నిర్వహణ
● ఆర్డీఎస్ ఆయకట్టుదారులకు
తప్పిన వెతలు
● గతంలో ఎత్తిపోతల పథకాల నిర్వహణ మొత్తం రైతులపైనే..
● జిల్లావ్యాప్తంగా ఇరిగేషన్
డివిజన్ కింద 11 సాగునీటి స్కీంలు
అలంపూర్(రాజోళి): ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో సాగుచేసే పంటలకు నీరందించేందుకు రైతులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఓవైపు పంటసాగు పెట్టుబడులతో పా టు నీటి కోసం కూడా కొంత మొత్తం వెచ్చించా ల్సి వస్తోంది. అయినప్పటికీ సాగునీటి ఇబ్బందులు త ప్పడం లేదు. ఆర్డీఎస్ కెనాల్‌కు పూర్తిస్థాయిలో నీరందినప్పుడు మాత్రమే రైతులకు ఏ సమస్య ఉండదు. ఎగువ నుంచి ఆర్డీఎస్ కెనాల్‌లో పూర్తిస్థాయి వాటా రాకపోయినా.. ఆయకట్టులో సా గుచేసిన పంటలకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న సమయంలో తుంగభద్ర నది సమీపంలో ఉన్న రైతు లు ఎన్నో అవస్థలు పడుతుంటారు. ఈ క్రమంలో సాగునీటి ఇబ్బందుల ను అధిగమించేందుకు రైతులే స్వయంగా చిన్నపాటి ఎత్తిపోతల పథకాలను రూపొందించుకున్నారు. వాటి ద్వారా నది నుంచి నీటిని తోడు కుని పంటలు ఎండకుండా చూసుకుంటున్నారు.
అన్ని స్కీంలు ఐడీసీ పరిధిలోకి..
గత ప్రభుత్వం జిల్లాలోని ఆర్డీఎస్ పరిధిని డివిజన్–4లోకి చేర్చింది. ఆ తర్వాత ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ)లో డివిజన్–4ను కలిపారు. దీంతో ఆర్డీఎస్, తుంగభద్ర నది కింద ఉన్న చిన్నపాటి ఎత్తిపోతల పథకాలతో పాటు ఇతరత్రా నీటి వనరులు ఐడీసీ పరిధిలోకి వచ్చాయి. తద్వారా ఏదేని ఎత్తిపోతల పథకం మరమ్మతుకు గురైతే ఆ భారం రైతులపై పడకుండా కొంత ఊరట కలిగింది. వాటి నిర్వహణకు అయ్యే ఖర్చులు, కావాల్సిన సిబ్బంది, ఇతర ఖర్చులను రైతు కమిటీలు, ప్రభు త్వం సంయుక్తంగా భరిస్తుండటంతో ఎత్తిపోతల పథకాల నిర్వహణ సవ్యంగా సాగుతోంది. గతంలో పథకాల మోటార్ల మరమ్మతుకు గురైనా, విద్యుత్‌కు సంబంధించిన సమస్య ఏర్పడినా రైతులే ఖర్చుచేసి.. మరమ్మతు చేయించాల్సి వచ్చేది. అలా కాకుండా ప్రభుత్వం, రైతు కమిటీలు కలిసి నిర్వహణ ఖర్చులను భరిస్తుండటంతో రైతులకు అదనపు పెట్టుబడి భారం తగ్గింది.
గతంలో పలుచోట్ల ఏర్పాటుచేసుకున్న ఎత్తిపోతల పథకాల్లో ప్రతి చిన్న పని నుంచి మేజర్ రిపేర్ వర కు రైతులే భరించే వారు. ఇందుకోసం రైతులందరం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసుకు న్నాం. ప్రస్తుతం ఈ స్కీంలన్నీ ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లడంతో కేవలం చిన్నపాటి రిపేర్లు మాత్రమే రైతుల ద్వారా చేసుకుంటున్నాం. మోటార్ల రిపేర్లు, మేజర్ మరమ్మతులను ఆర్డీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
– పరుశరాముడు, రైతు,
రామేశ్వర ఎత్తిపోతల పథకం, రాజోళి
ఐడీసీ పరిధిలోకి ఎత్తిపోతల పథకాలను చేర్చిన త ర్వాత రైతులకు భారం తగ్గింది. మేజర్ రిపేర్లు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. రైతుల విజ్ఞప్తి మేర కు మోటార్ల రిపేర్లు, తదితర మరమ్మతులకు ప్రతిపాదనలు పంపుతున్నాం. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే పనులు పూర్తిచేస్తున్నాం. ఇటీవల ఊట్కూర్, క్యాతూర్ తదితర లిఫ్టుల వద్ద పనులను చేయించాం.
– నాగరాజు, ఆర్‌ఈఎస్ డీఈ


