బీజేపీ నాయకుల ఆగ్రహం..
అలంపూర్(రాజోళి): రెండు తెలుగు రాష్ట్రాల నడు మ సరిహద్దు వివాదం తీరడం లేదు. కొన్నేళ్లుగా తుంగభద్ర నదిలో ఇసుకతీతకు సంబంధించి సరిహద్దు సమస్యగా మారుతోంది. ఏపీలోని కర్నూ లు జిల్లా వారు తెలంగాణ సరిహద్దులోకి వచ్చినప్పుడు స్థానికులు కేవలం అభ్యంతరం చెబితే వెనక్కి వెళ్లిపోయ్యే వారు. కానీ జిల్లావాసులు అనుకోకుండా అవతలి వైపు వెళ్లినప్పుడు నిరభ్యంతరంగా కేసులు నమోదు చేసి.. జరిమానాలు విధించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఏపీలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక రాజోళి మండలం తూ ర్పు గార్లపాడుకు వచ్చి మరీ ఒకేసారి పదుల సంఖ్యలో ట్రాక్టర్లకు జరిమానాలు విధించారు. అది కూడా ఇక్కడి ప్రభుత్వ అనుమతుల మేరకు ఇసు కను తీసుకొచ్చిన ట్రాక్టర్లపై కావడం గమనార్హం.
ఏడాది క్రితం సర్వేకు యత్నం..
ఏపీ అధికారుల జరిమానాల నేపథ్యంలో జిల్లావాసుల వాదనలు విన్న అప్పటి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ రాజోళి మండల పరిధిలోని తుంగభద్ర నదిలో సరిహద్దు సమస్యను తేల్చేందుకు వెళ్లారు. అయితే కేవలం ఏపీ పోలీసు అధికారులు మాత్రమే వచ్చారు. మైనింగ్ అధికారులు రాకపోవడంతో సర్వే నిలిచిపోయింది. అయితే ఆ సమ యంలో నదిలో హద్దులు ఏముంటాయనే మాట ను ఏపీకి చెందిన వారు చెప్పి తప్పించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా ప్రజల అవసరాల కోసం నదిలో నుంచి ఇసుకను తీస్తే కేసులు నమోదుచేసే స్థానిక అధికారులు.. ఏపీ నుంచి ఇసుక వాహనాలు జిల్లా సరిహద్దులోకి వ స్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నా యి. వీరి తీరుతోనే ఏపీ అధికారులు జిల్లాకు వచ్చి మరీ కేసులు నమోదు చేశారని ఆవేదన చెందుతున్నారు.
తాజాగా మరోసారి..
ఇటీవలి కాలంలో తమ పరిధిలోకి వస్తున్నారంటూ.. ఏపీకి చెందిన వారు అభ్యంతరాలు చెప్ప డం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే మంగళవారం తుంగభద్ర నదిలో ఇరు రాష్ట్రాల అధికారులు సర్వే చేసేందుకు సన్నద్ధమయ్యారు. జిల్లా నుంచి మైనింగ్‌శాఖ ఏడీ వెంకటరమణ, ఇతర అధికారులు హాజరయ్యారు. నదిలో వారు సరిహద్దును తేల్చేందుకు మ్యాప్‌లను పరిశీలించారు. ఈ క్రమంలోనే కర్నూలుకు చెందిన టీడీపీ నాయకుడు, కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. నదిలో నుంచి తట్ట ఇసుక తీసేందుకు వీలు లేదని.. తమ పరిధిలో కూడా తీయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే గద్వాల జిల్లాకు చెందినవారు ఇసుక తరలించడంతో కర్నూలు జిల్లాలో తాగునీటికి ఇబ్బందిగా ఉందన్నారు. ఇప్పటికే సమస్యను తెలంగాణ అధికారులకు కూడా తెలియజేశామని చెప్పడంతో సర్వే నిలిచిపోయింది. ఈ విషయమై జిల్లాకు చెందిన ఏడీ వెంకటరమణను అడగగా, ఆయన మౌనం వహించారు.
అంతకు ముందు నదిలోకి వచ్చిన మైనింగ్ ఏడీపై బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన వాహనాలు, జిల్లాకు చెందిన వాహనాలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాయని సమాచారం ఇస్తే పట్టించుకోలేదని.. కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదన్నారు. అక్రమ వ్యాపారం చేసే వారి ఫోన్ మాత్రం ఎత్తడం.. వారి దందాకు సహకరించడం మైనింగ్ అధికారులకు పరిపాటిగా మారిందని ఆరోపించారు.
తుంగభద్ర నదిలో
ఇసుకతీతకు హద్దు సమస్య
తాజాగా ఇరు రాష్ట్రాల అధికారుల రాక
ఏపీ టీడీపీ నాయకుడి అభ్యంతరంతో వెనుదిరిగిన అధికారులు


