● కొనుగోలు కేంద్రాల్లో
తడిసిన మొక్కజొన్న
● నేలకూలిన చెట్లు.. తెగిన విద్యుత్ వైర్లు
● పలు గ్రామాల్లో అంధకారం
అలంపూర్/అయిజ/ఉండవెల్లి: జిల్లాలోని అలంపూర్, అయిజ, ఉండవెల్లి తదితర మండలాల్లో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి భారీ చెట్లు నేలకొరిగాయి. ప్రధాన రోడ్లపై చెట్లు విరిగిపడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లోనే కాలం వెల్లదీయాల్సిన పరిస్థి తి నెలకొంది. అయిజ వ్యవసాయ మార్కెట్ సబ్‌యార్డులో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న బస్తాలు తడిసి ముద్దయ్యాయి. కొందరు రైతుల మొక్కజొన్నలు మొలకెత్తడంతో తీవ్రనష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రంలో 20 – 30 రోజుల క్రితం కాంటా వేసిన మొక్కజొన్న బస్తాలను గోదాంలకు తరలించకపోవడంతో అకాల వర్షానికి తడిసిపోయాయని రైతు లు ఆవేదన వ్యక్తంచేశారు. అదే విధంగా మామిడి తోటల్లోని కాయలు నేలరాలాయి. ఎకరాకు రూ. లక్ష నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు.
● ఈదురుగాలుల ధాటికి అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలోని పురావస్తు మ్యూజియం వద్ద ఓ చెట్టుతో పాటు హైమాస్ట్ లైటు నేలకూలింది. జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలోని చెట్టు సైతం నేలకొరిగింది. పలు కాలనీల్లో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. సాలేవిధిలో ఆదివారం సైతం విద్యుత్ సరఫరా పునరుద్దరించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలంపూర్ చౌరస్తా ప్రధాన మార్గంలోని పెట్రోల్‌బంక్ వద్ద ఓ చెట్టు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. బూడిదపాడు సర్కిల్‌లోని బసవేశ్వర బస్టాఫ్ షెడ్ ఈదురుగాలుల ధాటికి ఓవైపు వాలిపోయింది. ఉండవెల్లిలో రేకుల షెడ్లు ధ్వంసమయ్యాయి.
ఈదురుగాలులతో కూడిన కురిసిన వర్షాని కి మామిడితోటలకు అపారంగా నష్టం వాటిల్లింది. గాలికి నేలరాలడంతో పండ్లు దెబ్బతిని నాణ్యత కోల్పోయాయి. కొన్ని మార్కెట్‌లో విక్రయించేందుకు పనికిరాకుండా పోయాయి. దీంతో తోటల రైతులకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. – దర్శల్లి, రైతు, అయిజ


