వానాకాలం.. ‘సాగు’దాం | - | Sakshi
Sakshi News home page

వానాకాలం.. ‘సాగు’దాం

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

సాగుకు సిద్ధం..

వానాకాలంలో పంటల సాగు అంచనా ఇలా..

ఎరువులు ఇలా...

గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో వానాకాలం (2026–27) పంట ప్రణాళిక ఖరారైంది. ఈసారి 4,35,252 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గతేడాది వానాకాలం రైతులను నిరాశపర్చింది. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి.. పంటలు బాగా పండుతాయన్న ఆశతో అన్నదాతలు సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇదే సమయంలో పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులను వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది.

గతేడాది నిరాశే..

గతేడాది వానాకాలం రైతులకు కన్నీరు తెప్పించింది. ప్రారంభంలో ఆశించిన వర్షాలు కురవలేదు. ఆ తర్వాత జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన అధిక వర్షాల ప్రభావం పంటలపై పడింది. పలుచోట్ల నీటి నిల్వలతో మొక్కలు ఎదగలేదు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. దాదాపు అన్ని రకాల పంటలకు తెగుళ్లు, రకరకాల పురుగులు ఆశించాయి. జిల్లాలో అధికంగా సాగుచేసిన పత్తి పంట దిగుబడులు సగానికి పడిపోయాయి. పత్తి, వరి, వేరుశనగ, కంది ఇలా అన్నిరకాల పంటల దిగుబడులు తగ్గడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. అధిక వర్షాలతో కూరగాయల తోటలు సైతం దెబ్బతిన్నాయి. తోటలకు కాయలు పట్టే దశలో వర్షాలు రావడంతో మొక్కపైనే మురిగిపోయాయి. దిగుబడులు గణనీయంగా తగ్గాయి. పలుచోట్ల వర్షపు నీరు నిలిచి తోటలు నీటమునిగాయి. అక్టోబర్‌లో కురిసిన వర్షాలు సైతం నష్టాన్ని కలిగించాయి. చేతికొచ్చిన కొద్దిపాటి కూరగాయలు సైతం రంగులు మారాయి. వాటి నాణ్యత తగ్గి.. మార్కెట్‌లో రైతులకు ధరలు రాలేదు.

పత్తి వైపే మొగ్గు..

ఈసారి వానాకాలంలో 3,92,882 ఎకరాల్లో వ్యవసాయ, 42,370 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 2,09,144 ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉంది. అదే విధంగా వరి, కంది, వేరుశనగ పంటలను ఎక్కువగా సాగుచేస్తారని భావిస్తున్నారు. ఇక ఉద్యాన పంటలకు సంబంధించి 25వేల ఎకరాల్లో ఎండుమిర్చి, 4వేల నుంచి 5వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌, మిగిలిన ఎకరాల్లో ఇతర పంటలు సాగు అంచనాగా ఉంది. ఇదిలా ఉంటే, పంటలకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల లెక్కలను సైతం అధికారులు సిద్ధం చేశారు. దాదాపు 59వేల క్వింటాళ్ల పత్తి, వరి, కంది తదితర పంటలకు విత్తనాలు అవసరం అవుతాయని అంచనాకు వచ్చారు. సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.

జిల్లాలో పంటల ప్రణాళిక ఖరారు

ఈసారి 4,35,252 ఎకరాల్లో

సాగు అంచనా

విత్తనాలు, ఎరువులను

సిద్ధం చేస్తున్న వ్యవసాయశాఖ

వానాకాలం సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. గత రెండు రోజుల వ్యవధిలో ఓ మోస్తారు వర్షాలు కురవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు వేసవి దుక్కులు దున్నుతున్నారు. విత్తనాల కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూన్‌ రెండు, మూడో వారం నాటికి వర్షాలు ఆశించిన స్థాయిలో కురిస్తే చివరి వారంలో విత్తనాలు వేయాలని రైతులు భావిస్తున్నారు.

పంట సాగు (ఎకరాల్లో)

పత్తి 2,09,144

వరి 1,21,941

కంది 23,739

మొక్కజొన్న 22,982

వేరుశనగ 6,396

ఇతర పంటలు 8,680

ఉద్యానపంటలు 42,370

రకం అవసరం (మెట్రిక్‌ టన్నుల్లో)

యూరియా 27,390

డీఏపీ 13,919

పొటాష్‌ 7,615

కాంప్లెక్స్‌ ఎరువులు 55,173

Advertisement
 
Advertisement
Advertisement