బోగస్‌ పింఛన్లకు చెక్‌! | - | Sakshi
Sakshi News home page

బోగస్‌ పింఛన్లకు చెక్‌!

May 24 2026 12:51 AM | Updated on May 24 2026 12:51 AM

పకడ్బందీగా సర్వే..

గద్వాలన్యూటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనది చేయూత పథకం. ఈ పథకం ద్వారా సమాజంలో ఆర్థికంగా వెనకబడిన, ఆదరణ లేని వృద్ధులు, వితంవులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత కార్మికులకు నెలకు రూ. 2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున అందిస్తున్నారు. అయితే ఈ పింఛన్‌ డబ్బులు లబ్ధిదారుల పోస్టల్‌, బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేస్తున్నారు. పోస్టల్‌ అకౌంట్లలో జమ అవుతున్న లబ్ధిదారులకు సంబంధిత ఏరియా పోస్ట్‌మన్‌ బయోమెట్రిక్‌ లేదా ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌లో క్యాప్చర్‌ చేసి పింఛన్‌ డబ్బులు అందిస్తున్నారు. ఈ విధానం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఇక పట్టణ, మండల కేంద్రాల్లో లబ్దిదారుల బ్యాంక్‌ అకౌంట్లలో జమ అవుతుంది. వీరు ఏటీఎం ద్వార లేదా బ్యాంక్‌కు వెళ్లి నగదు తీసుకుంటున్నారు. అయితే చాలా మంది పింఛన్‌దారులు మృతిచెందినా వారి ఖాతాలో డబ్బులు జమ అవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు గాను ప్రతి పింఛన్‌దారుడిని ప్రత్యక్ష ధ్రువీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సర్వే ఇప్పటికే జిల్లాకేంద్రంలో ప్రారంభం కాగా.. సోమవారం నుంచి అన్ని గ్రామాల్లో చేపట్టనున్నారు.

అక్రమాలు ఇలా.. చేయూత పథకం కింద పింఛన్‌ పొందే వ్యక్తి మృతిచెందితే సదరు కుటుంబ సభ్యులు పింఛన్‌ నిలిపివేయాలని పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కఇషనర్‌కు, గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓకు లిఖిత పూర్వకంగా తెలియజేయాలి. ఇలా చేస్తే అధికారులు జిల్లా గ్రామీణభివృద్ధిశాఖకు సమాచారం అందించి పింఛన్‌ నిలిపివేస్తారు. కానీ ఇక్కడే అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పింఛన్‌ పొందుతున్న వ్యక్తి చనిపోతే వారి కుటుంబ సభ్యులు ఉద్దేశ్యపూర్వకంగా ఎలాంటి సమాచారం అందించడం లేదు. పింఛన్‌ డబ్బులను ఏటీఎం లేదా ఫోన్‌పే, గూగుల్‌ పే తదితర వాటి ద్వారా పొందుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. బోగస్‌ పింఛన్ల ఏరివేతకు చర్యలు చేపట్టింది.

ప్రత్యేక యాప్‌తో..

చేయూత లబ్ధిదారుల ప్రత్యక్ష ధ్రువీకరణ కోసం ప్రత్యేకంగా యాప్‌ రూపొందించారు. నిబంధనల ప్రకారం లాగిన్‌ ఐడీతో యాప్‌ ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. పింఛన్‌దారుడి ఐడీ లేదా ఆధార్‌ నంబర్‌ను ఎంట్రీ చేసిన తర్వాత వివరాలు వస్తాయి. ఆ వివరాలను నిర్ధారించుకొని పింఛన్‌దారుడి ముఖాన్ని కెమెరా ద్వారా (లైవ్‌ అథెంటికేషన్‌) ప్రత్యక్ష ధ్రువీకణ చేస్తున్నారు. పింఛన్‌ పొందుతున్న ప్రతి అబ్ధిదారుడు ప్రత్యక్ష ధ్రువీకరణ చేయించుకోవాల్సిందే. ఈ సర్వే ఐదు రోజల క్రితం జిల్లాకేంద్రమైన గద్వాల మున్సిపాలిటీలో ప్రారంభమైంది. ఇక మండల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సర్వే చేపట్టే విషయంపై జిల్లాలోని 13 మండలాల గ్రామ కార్యదర్శులు, మిగిలిన మూడు మున్సిపాలీటీల వార్డు ఆఫీసర్లకు గురువారం కలెక్టరేట్‌లోని ఐడీఓసీలో శిక్షణ అందించారు. కాగా, సర్వే సమయంలో పింఛన్‌దారుడు స్థానికంగా అందుబాటులో లేకపోతే ఎనిమిది రోజుల గడువు ఇస్తున్నారు.

చేయూత పథకం

లబ్ధిదారుల ప్రత్యక్ష ధ్రువీకరణ

ప్రత్యేక యాప్‌తో సర్వే ప్రారంభం

సర్వేతో అక్రమాలకు కళ్లెం

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేయూత పింఛన్‌ పొందుతున్న లబ్దిదారుల లైవ్‌ అథెంటికేషన్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తాం. యాప్‌ ద్వారా నిర్వహించనున్న ఈ సర్వేపై పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లకు ఒకరోజు శిక్షణ అందించాం. గద్వాల మున్సిపాలిటీలో ఇప్పటికే సర్వే ప్రారంభమైంది. సర్వేకు పింఛన్‌దారులు సహకరించాలి.

– మసాయిదాబేగం, డీఆర్డీఓ

Advertisement
 
Advertisement
Advertisement