కొల్లాపూర్ రూరల్: పర్యాటక అభివృద్ధి పేరుతో తమ పొట్టలు కొట్టొద్దని, తమ భూములకు పట్టాలిస్తే అభివృద్ధికి సహకరిస్తామని ప్రభుత్వానికి, మంత్రి జూపల్లి కృష్ణారావుకు సోమశిల దళిత రైతులు విజ్ఞప్తి చేశారు. శనివారం సోమశిల శివారులోని సర్వే నంబర్ 54 భూమిలో దళిత రైతులు గ్రామ పెద్దలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యాటక రంగ అభివృద్ధి పేరుతో తమ భూముల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేశారు. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదన్నారు. 1996లో ఆనాటి ప్రభుత్వం 54 సర్వే నంబర్‌లో 118 ఎకరాలను స్థానిక దళితులకు పట్టా ఇచ్చిందన్నారు. కానీ బీఆర్‌ఎస్ హాయాంలో ధరణిలో ఎక్కకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు కోల్పోయామని వాపోయారు. గ్రామంలోనే సర్వే నంబర్ 80లో ప్రభుత్వ భూమి ఉన్నా.. హెలిప్యాడ్ నిర్మాణానికి తమ భూములే తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కక్షపూరితంగా వ్యవహరించి, అధికార బలంతో రాత్రికిరాత్రే హెలిప్యాడు నిర్మాణ పనులు చేపట్టారని మండిపడ్డారు. తమ భూములకు పట్టాలు ఇస్తే హెలిప్యాడ్ నిర్మాణానికి 2 ఎకరాల భూమి ఇస్తామన్నారు. లేని పక్షంలో ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ బన్సీలాల్ వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు వెంకటస్వామి, రంగస్వామి, మాజీ జెడ్సీటీసీ సభ్యులు కాటం జంబులయ్య, బాల్‌రెడ్డి, రవి, బీజేపీ మండల అధ్యక్షుడు కేతూరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.


