గద్వాల: పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లా విద్యార్థులు గతం కంటే కొంత మెరుగైన ఫలితాలు సాధించారు. మొత్తం 8,037 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 7,549 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 4,001మంది బాలికలు, 3,548 మంది బాలురు ఉన్నారు. బాలికలు 95.49శాతం, బాలురు 92.23శాతం ఉత్తీర్ణత సాధించగా.. మొత్తం 93.93శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే జిల్లా 29వ స్థానంలో నిలిచింది. 2024–25 విద్యా సంవత్సరంలో 91.74 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 26వ స్థానంలో నిలువగా.. ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగినప్పటికీ రాష్ట్రస్థాయిలో మూడు స్థానాలు పడిపోయి 29వ స్థానానికి చేరింది. ఫలితాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చారు.
ముందంజలో నిలపాలి: కలెక్టర్
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా 93.9శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 29వ స్థానంలో నిలిచినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈమేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ముందుంజలో నిలిచేందుకు విద్యాశాఖ అధికారులు కృషిచేయాలని సూచించారు.
విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందన
పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్‌లో ఇదేస్ఫూర్తితో ముందుకుసాగి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో పలు పాఠశాలల విద్యార్థులను అభినందించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పూజిత 577, మరో 20మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించి ప్రైవేటుకు ధీటుగా ప్రతిభ చాటడం అభినందనీయమన్నారు.
రీకౌంటింగ్.. రీవెరిఫికేషన్‌కు..
జవాబుపత్రాలను రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసుకోవాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మార్కుల రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టు కోసం రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.వెయ్యి ఫీజు చెల్లించాలని సూచించింది. గురువారం నుంచి వచ్చేనెల 14 వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వీరితోపాటు ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాసే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం మే 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉండగా.. జూన్ 6 నుంచి 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
55 పాఠశాలల్లో వందశాతం..
జిల్లావ్యాప్తంగా 55 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 34 ఉండగా, ప్రైవేటు స్కూళ్లు 21 ఉన్నాయి. అదే విధంగా గద్వాల ప్రభుత్వ పాఠశాల, అయిజ మండలం ఉత్తనూరు పాఠశాలకు చెందిన విద్యార్థులు పి.పూజిత, పి.పవిత్ర 577 మార్కులతో జిల్లా టాపర్లుగా నిలిచారు. ప్రైవేటు పాఠశాలకు చెందిన టి.అభిరామ్ 591 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ చాటాడు.
సంతోషంగా ఉంది..
నాకు 577 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను బాగా చదువుకునేందుకు అమ్మ సుజాత, నాన్న గోవిందు ఎంతో సహకరించారు. అదే విధంగా పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. భవిష్యత్‌లో ఇదేస్థాయిలో చదివి పర్యావరణ ఇంజినీరు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
– పి.పూజిత,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గద్వాల
93.93శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లాకు 29వ స్థానం
8,037మంది విద్యార్థులకు గాను 7,549 మంది పాస్
గతం కంటే పెరిగిన ఉత్తీర్ణత శాతం
55 పాఠశాలల్లో వందశాతం ఫలితాలు


