మంత్రి వాకిటి శ్రీహరి ఎక్స్–అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడంతో కాంగ్రెస్–2, సీపీఎం–2 కో–ఆప్షన్ స్థానాలు కై వసం చేసుకున్నాయి. కో–ఆప్షన్ ఎన్నికకుగాను పదిమంది కౌన్సిలర్లు సకాలంలో కార్యాలయానికి చేరుకోగా మంత్రి వస్తున్నారనే సమాచారంతో పుర కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పటిష్టం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. సీపీఎం నుంచి చిన్నన్న, షాజహాన్, కాంగ్రెస్‌పార్టీ నుంచి తౌఫిక్, మణెమ్మను కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం మంత్రి ఎన్నికై న సభ్యులను శాలువాలతో సన్మానించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజకీయలు పక్కనబెట్టి పట్టణాభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్ జింక సువర్ణ రవి, వైస్ చైర్‌పర్సన్ రాధ అరుణ్, సీఐ శివకుమార్, ఎస్‌ఐలు స్వాతి, జయన్న పాల్గొన్నారు.
అమరచింత: స్థానిక పుర కార్యాలయంలో సోమవారం జరిగిన కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 11 గంటల సమయంలో ఎన్నిక జరుగుతుందనే సమాచారంతో బీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ముందుగానే పుర కార్యాలయానికి చేరుకోన్నారు. ఇచ్చిన సమయం దాటుతున్నా పుర అధికారులు ఎన్నిక నిర్వహించకపోవడం వారికి ఆగ్రహం తెప్పించింది. దీనికితోడు పుర కార్యాలయ ఆవరణ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిండుకోవడంతో అసహనానికి గురైన బీజేపీ కౌన్సిలర్ మేర్వ రాజు సమయం దాటిపోయిందని, వెంటనే ఎన్నిక నిర్వహించాలని అక్కడే ఉన్న పుర కమిషనర్ నూరుల్ నదీంతో వాగ్వాదానికి దిగారు. ఒకనొక సమయంలో కౌన్సిలర్ కమిషనర్ కుర్చీ, చెయ్యి పట్టుకొని లాగేందుకు యత్నించగా ఇరువురి మధ్య మాటల యుద్ధం పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే గమనించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కౌన్సిలర్ రాజును బయటకు తీసుకొచ్చి అదుపులోకి తీసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. కమిషనర్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదుతో కౌన్సిలర్ మేర్వరాజుపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ స్వాతి తెలిపారు.
పుర కమిషనర్, బీజేపీ కౌన్సిలర్ మధ్య వాగ్వాదం
కమిషనర్ ఫిర్యాదుతో కౌన్సిలర్‌పై
కేసు నమోదు
పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
మంత్రి ఓటుతో అధికార పక్షం కై వసం
చెరో రెండు స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్, సీపీఎం


