2022లో ఆర్డీఎస్ మరమ్మతుకు రూ.11 కోట్ల కేటాయింపు
●
రాజోళి: ‘దేవుడు కరుణించినా.. పూజారి కరుణించలేదు’ అన్న చందంగా మారింది ఆర్డీఎస్ కెనాల్ పరిస్థితి. దశాబ్దాల కాలంగా ఆర్డీఎస్‌లో ఆధునికీకరణ పనులు చేయకపోగా.. దాన్ని ప్రతిపాదనలు పక్కకు పెట్టి మరమ్మతు చేపట్టేందుకు సిద్ధయమ్యారు. ఇందుకోసం 2022లో రూ.11 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది తాత్కాలిక ఉపశమనమైనప్పటికీ.. కెనాల్ మరింత బలహీనపడిపోతుండటంతో ఈ పనులు ఆర్డీఎస్‌కు ప్రయోజనకరంగానే మారాయి. కానీ, చేస్తున్న పనులే ఆలస్యమవుతుండటంతో చివరికి ప్రయోజనం ఉండకుండా పోతుందని రైతులు వాపోతున్నారు.
65 నుంచి 145 కి.మీ., వరకు..
ఆర్డీఎస్ కెనాల్ 65వ కి.మీ., నుంచి 145 కి.మీ., వరకు ఈ పనులు చేపట్టేలా ప్లానింగ్ చేశారు. అందులో భాగంగా సిల్ట్ రెన్యువల్, బ్యాకింగ్ వర్క్స్, సీసీ వర్క్, కాంక్రీట్ పనులు, జంగిల్ క్లియరెన్స్ లాంటివి చేయాల్సి ఉంది. కాగా చేపట్టిన పనులు వేగంగా జరగకపోగా.. చేస్తున్న సమయం అనుకూలించడం లేదని రైతులు అంటున్నారు. రూ.11 కోట్లకు గాను ఇప్పటికే రూ.7.20 కోట్ల విలువ చేసే పనులు పూర్తయ్యాయి. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్‌కు అనుబంధంగా ఉన్న మరో కాంట్రాక్టర్‌తో అదనంగా మరో రూ.3 కోట్ల పనులు చేపట్టగా.. ఇప్పటికి దాదాపు రూ.2 కోట్ల పనులు చేయాల్సి ఉందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీటిని త్వరగా పూర్తి చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
సమన్వయంతో పనిచేయాలి..
ఆర్డీఎస్ అంటే గద్వాల జిల్లాకు ఆయువు. దానికి సంబంధించిన పనులు చేసేటప్పుడు అధికారులు, ప్రభు త్వం సమన్వయంతో పనిచేయాలి. కెనాల్‌లో మరమ్మతు చేపట్టి చా లా ఏళ్లు అవుతుంది. ఇలాగే నెమ్మదిగా సాగితే ప్రయోజనం ఏముంటుంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి వచ్చే వ్యవసాయ సీజన్‌లోగా మరమ్మతు పూర్తి చేసి రైతులకు సహకరించాలి. – మద్దిలేటి, రైతు, వడ్డేపల్లి
రైతులకు ఇబ్బంది కలిగించొద్దు
పనులు చేసేదే రైతుల కోసం. అలాంటప్పుడు వారికి అనుకూలించేలా చేయాలి. అంతే కానీ కెనాల్‌లో నీరు ఉన్న ప్పుడు, రైతులు సాగు లో బిజీగా ఉన్నప్పుడు పనులు చేస్తామంటే దా ని వల్ల రైతులకే ఇబ్బంది కలుగుతుంది. 2022 లో నిధులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు 65 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలి. – వడ్డే స్వాములు, రైతు, జిల్లేడుదిన్నె
నోటీసులు ఇచ్చాం..
ఆర్డీఎస్ కెనాల్ మరమ్మతు పనులు ఇప్పటికే 65 శాతం పూర్తయ్యాయి. ఇంకా రూ.2 కోట్ల కు సంబంధించిన పనులు చేయాల్సి ఉంది. అయితే పనుల్లో ఆలస్యమవుతుందని సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చాం. ప్రస్తు తం సాగు సీజన్ కాకపోవడంతో పనులు వేగ ంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు చెప్పాం. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం.
– శ్రీనివాసులు, ఈఈ, ఆర్డీఎస్
నేటి వరకు నత్తనడకన కొనసాగుతున్న పనులు
నాలుగేళ్లు గడిచినా 60 శాతమే పూర్తి..
సీజన్ ప్రారంభానికి ముందే చేపట్టాలంటున్న రైతులు
ఇప్పటికిప్పుడు మొదలుపెడితేనే పూర్తయ్యే అవకాశం


