గద్వాలన్యూటౌన్: ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేయడంలో జాప్యం తగదని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో టీఎస్ యూటీఎఫ్ ఆవిర్బావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వం రెండున్నరేళ్లు గడుస్తున్నా పీఆర్‌సీ నివేదిక బయటపెట్టకుండా.. సంఘాలతో చర్చలు జరపకుండా జాప్యం చేయడం సమంజసం కాదన్నారు. పీఆర్‌సీ నివేదికను బహిర్గతపర్చి, సంఘాలతో చర్చించిన అనంతరం ఆమోదయోగ్యమైన ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా హెల్త్ కార్డ్స్ ప్రాసెస్ పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సీపీఎస్ విధానం రద్దుచేసి.. పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లులను విడుదల చేయాలని, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు లేదా అందరికీ ఒకే రకమైన మెరిట్ విధానం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ నాయకులు చిరంజీవి నాయుడు, చంద్రకాంత్, లక్ష్మణ్, బీచుపల్లి, సుదర్శన్, చిన్న నర్సింహులు, జయన్న, రామకృష్ణ, సుధాకర్ పాల్గొన్నారు.
పేదలకు రాజ్యాధికారమే అంబేడ్కర్ ఆశయం
గద్వాలన్యూటౌన్: పేద వర్గాల చేతుల్లోకి అధికారం రావడమే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయమని భీమ్ ఆర్మీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మాచర్ల ప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు వర్షిత్, అఖిలపక్ష కమిటీ అధ్యక్షుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, మధుసూదన్‌బాబు అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవా రం జిల్లా కేంద్రంలో భీమ్ ఆర్మీ ఆద్వర్యంలో అంబేడ్కర్ ఆలోచనా పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ చౌరస్తా నుంచి వైఎస్సార్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడే నిర్వహించిన సభ లో వారు మాట్లాడారు. దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని దేశానికి అందించారని కొనియాడారు. తన జీవితాంతం పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఆవాస్ రాష్ట్ర నాయకుడు అతికూర్ రహ్మన్, నాయకులు రవి, పల్లయ్య, వినోద్, నర్సింహ, లక్ష్మణ్, సురేష్, విజయ్, రమేశ్, రఘునందన్ పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,971
గద్వాలవ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు సోమవారం 914 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,971, కనిష్టంగా రూ. 4,019, సరాసరి రూ. 6,049 ధర పలికింది. అదే విధంగా 457 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,199, కనిష్టంగా రూ. 5,809, సరాసరి రూ. 6,060 ధరలు వచ్చాయి. 13 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 6,506, కనిష్టంగా రూ. 6,219, సరాసరి రూ. 6269 ధరలు లభించాయి. 816 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,456, కనిష్టంగా రూ. 1,986, సరాసరి రూ. 2,306 ధర పలికింది.


