గద్వాలన్యూటౌన్: ప్రజల నుంచి అందే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన నేరుగా తెలుసుకుని ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చి, అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ సమస్యలపై 114 అర్జీలు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
జనగణనకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలో జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్ (డీసీఓ) భారతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో జనగణన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జనగణన ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 1,073 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ గుర్తించామని.. 1,341 మంది ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామక ప్రక్రియ పూర్తిచేశామని వివరించారు. కాగా, చార్జ్ అధికారుల వివరాలను ఈ నెల 15వ తేదీలోగా సమర్పించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. 18 నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ పాపయ్య, ఏఓ భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


