ఎర్రవల్లి: ప్రజల ప్రాణాల రక్షణ కోసమే పోలీసుశాఖ అరైవ్.. అలైవ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎస్పీ తోట శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎర్రవల్లిలో అరైవ్.. అలైవ్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. 44వ నంబర్ జాతీయ రహదారి ఉన్న ఎర్రవల్లి మండలంలో రోడ్డు భద్రత పాటించడం ఎంతో అవసరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజు 70 నుంచి 80 వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. అందులో 20 నుంచి 30 మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యుల పాత్రను ఆయన వివరించారు. అదే విధంగా గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. సర్పంచ్ అనితా కృష్ణసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్‌ఐ రవి రాథోడ్, ఉపసర్పంచ్ మద్దిలేటిగౌడ్, పంచాయతీ కార్యదర్శి రంగన్న పాల్గొన్నారు.


