● పశువులు, గేదెలకు గాలికుంటు
వ్యాధి నిరోధక టీకాలు
● 13 మండలాల్లో
27 బృందాలతో పంపిణీ
● జిల్లాలో గోజాతి 30,763,
గేదెజాతి 29,956 పశువులు
గట్టు: జిల్లాలో పశువులను గాలికుంటు వ్యాధి బారి నుంచి రక్షించేందుకు చేపట్టిన వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమం విజయవంతంగా పూర్తిచేసినట్లు పశువైద్యాధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో 27 బృందాలు గ్రామాల్లో నిరంతరం పర్యటించి, పశువులు, గేదెలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. మార్చి 10న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన పశువైద్య సిబ్బంది ఈ నెల 11 వరకు పూర్తిచేశారు. సంపూర్ణ అభియాన్ 2.0 ప్రోగ్రాంలో భాగంగా గాలికుంటు (ఎఫ్‌ఎండీ) ని ర్మూలనలో భాగంగా చేపట్టిన వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వందశాతం పూర్తిచేశారు. సాధారణంగా పశువులు, గేదెల్లో పుట్ అండ్ మౌత్ ద్వారా వచ్చే వ్యాధిని దూరం చేసేందుకు ప్రత్యేకంగా వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని పశువైద్య సిబ్బంది విజయవంతంగా పూర్తిచేశారు.
యాస్పిరేషన్ బ్లాక్‌గా ఎంపిక..
నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా గట్టు మండలాన్ని యాస్పిరేషన్ బ్లాక్‌గా ఎంపిక చేశారు. ఇక్కడి పశువులు, గేదెలు అన్నింటికీ ముందస్తుగానే ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను వేసినట్లు పశువైద్యాధికారులు నవీన్‌చంద్ర, ప్రియాంక తెలిపారు. జిల్లావ్యాప్తంగా గోజాతి 4 నెలలు పైబడిన దూడలు, ఆవులు, కోడెలు, ఎద్దులు మొత్తం 30,763 ఉండగా.. గేదెజాతి 4 నెలల పైబడిన దూడలు, గేదెలు, పడ్డలు మొత్తం 29,956 ఉండగా.. వీటన్నింటికీ వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు పశువైద్యాధికారులు తెలిపారు.
ప్రత్యేక కార్యాచరణ అమలు..
నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పాలమూరులోని నారా యణపేట జిల్లా నర్వ, జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలాన్ని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో సంపూర్ణ అభియాన్ 2.0 ప్రోగ్రాంలో భాగంగా గట్టులో ఎఫ్‌ఎండీ పుట్ అండ్ మౌత్ డిసీజ్ బారిన పశువులు పడకుండా ముందస్తుగా పశువైద్య సిబ్బంది ప్రత్యేకంగా ఉచిత టీకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గట్టు మండలంలోని 27 గ్రామాల్లో మొత్తం 9,316 పశువులు ఉండగా.. వందశాతం వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు పశువైద్యాధికారులు తెలిపారు.


