కొల్లాపూర్‌కు రైల్వే టూరిజం తీసుకురావాలి | - | Sakshi
Sakshi News home page

కొల్లాపూర్‌కు రైల్వే టూరిజం తీసుకురావాలి

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

కొల్లాపూర్‌ రూరల్‌: కొల్లాపూర్‌కు హెలీ టూరిజంతోపాటు రైల్వే టూరిజం కూడా తీసుకురావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. ఆదివారం కొల్లాపూర్‌లోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో రైల్వే లైన్‌ సాధన కోసం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కొల్లాపూర్‌ మీదుగా రైల్వే లైన్‌ వస్తే ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ పరిశ్రమలకు కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్నాయన్నారు. నంద్యాల నుంచి జడ్చర్ల మీదుగా రైల్వే లైన్‌ వేయడానికి అవకాశం వచ్చిందో.. దానిని కొల్లాపూర్‌ మీదుగా వేసేలా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి జూపల్లి కృష్ణారావు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో నేషనల్‌ హైవే–167తోపాటు బ్రిడ్జి నిర్మాణం కూడా జరుగుతుందని, దీనిని మల్టీపర్పస్‌గా అభివృద్ధి చేస్తే ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌, రాజ్యసభలో ప్రస్తావించేందుకు తమ పార్టీ ఎంపీలు కృషి చేస్తారన్నారు. సీపీఐ ఎప్పటికీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీలు చేసిన పోరాటాలు ఏమీ వృథాగా పోలేదని, కొల్లాపూర్‌కు రైల్వే లైన్‌ రావడానికి కూడా పోరాటాలు చేస్తామని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌, నాయకులు విజయుడు, శివుడు, ఇందిర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement