నడిగడ్డలో పెరుగుతున్న పండ్ల తోటల సాగు విస్తీర్ణం
గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉండటంతోపాటు ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు పండ్లతోటలకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో వీటి సాగుపై ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే పండ్లు తెంపిన తర్వాత వాటిని నిల్వ ఉంచడానికి, అవసరమైన ప్రాసెసింగ్ చేయడానికి రైతులు ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను అధిగమించడానికి ప్యాక్‌హౌస్‌లు ఎంతో ఉపయోగపడతాయి. ఉద్యానశాఖ ఎంఐడీహెచ్ పథకం కింద 50 శాతం సబ్సిడీపై ప్యాక్‌హౌస్‌ల నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది.
నేలలు.. వాతావరణం
జిల్లాలో పండ్లతోటలకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్లతోటలు, కూరగాయల సాగుకు ఎర్రటి, ఒండ్రుతో కూడిన ఎర్రటి నేలలు ఉండాలి. నడిగడ్డలో ఇలాంటి నేలల శాతమే ఎక్కువగా ఉంది. సాగునీటి విషయానికి వస్తే జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్‌లతోపాటు నెట్టెంపాడు ఎత్తిపోతలు, రిజర్వాయర్లు, నోటిఫైడ్ చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటన్నింటి ఆధారంగా బోర్లు, బావుల్లోనూ ఆశించిన స్థాయిలో నీరు ఉంటోంది. సాధారణంగా పండ్లతోటలను బోర్లు, బావుల కిందే సాగు చేస్తారు. ఇక వాతావరణం విషయానికి వస్తే వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నా.. సాయంత్రం నుంచి రాత్రి వరకు చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఎంత చలి ఉన్నా.. ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవు. ఇలా నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
బడ్జెట్ కేటాయింపు ప్రకారం..
పండ్లు తెంపిన తర్వాత పలు సందర్భాల్లో వాటిని నిల్వ ఉంచడం, కోల్డ్ స్టోరేజీలో ఉంచడం, ఎగుమతి కోసం ప్యాకింగ్, ప్రాసెసింగ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి సమయంలో తగిన వసతి లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. బయటి వాతావరణంలో తెంపిన పండ్లను ఉంచి, ఆర్థికంగా నష్టపోతుంటారు. వీటిని అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎంఐడీహెచ్ (మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్) పథకం కింద ప్యాక్‌హౌస్ నిర్మాణాలను 50 శాతం సబ్సిడీపై అందించి ప్రోత్సహిస్తోంది. ప్యాక్‌హౌస్‌కు రూ.4.80 లక్షల వ్యయం అవుతుండగా.. ఇందులో రైతు వాటాగా రూ.2.40 లక్షలు భరిస్తే.. మిగిలిన రూ.2.40 లక్షలు ఎంఐడీహెచ్ కింద సబ్సిడీ అందిస్తున్నారు. ఈ ప్యాక్‌హౌస్‌కు నీరు, వేయింగ్ మిషన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు. పలు ప్రయోజనాలు ఉన్న ఈ ప్యాక్ హౌస్‌లను బడ్జెట్ కేటాయింపుల ప్రకారం 2025– 26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 10 నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించగా.. 9 చోట్ల పూర్తయ్యాయి. 2026– 27లో వీటి నిర్మాణాల కోసం మరింత బడ్జెట్ కేటాయించాలని ఉద్యాన రైతులు కోరుతున్నారు.
గద్వాల మండలం అనంతపురంలో
నిర్మించిన ప్యాక్‌హౌస్
అనుకూల పరిస్థితులతో ఆసక్తి చూపుతున్న రైతులు
జిల్లావ్యాప్తంగా 2025–26లో
9 నిర్మాణాలు పూర్తి
ఎంఐడీహెచ్ పథకం కింద 50 శాతం సబ్సిడీ
2026– 27లో మరింత బడ్జెట్ కేటాయించాలని వేడుకోలు
17,400 ఎకరాల్లో సాగు
జిల్లాలో రైతులు పత్తి, వరి, వేరుశనగ తదితర పంటలను ఏళ్ల తరబడి నుంచి సాగు చేస్తున్నారు. అయితే గడిచిన పదేళ్ల నుంచి రైతుల ఆలోచనా విధానంలో మార్పు వస్తోంది. ప్రధానంగా పండ్లతోటలకు ఇక్కడి నేలలు, వాతావరణం అనుకూలంగా ఉండటానికి తోడు వీటి సాగు వల్ల పండ్ల రకాన్ని బట్టి 3–5 ఏళ్లపాటు మంచి యాజమాన్య పద్ధతులు అవలంభిస్తే తోటలు బాగా వచ్చి ఆర్థికంగా లాభపడతామన్న ఆలోచనతో రైతులు పండ్ల తోటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మామిడి, బత్తాయి, పొప్పాయి, అంజీర, జామ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పండ్లతోటలు సాగు చేస్తున్నారు. ఏటా పండ్లతోటల సాగు జిల్లాలో పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో 17,400 ఎకరాాల్లో పండ్ల తోటలు సాగులో ఉన్నాయి.


