గద్వాల న్యూటౌన్: సమాజంలోని అసమానతలను తొలగించేందుకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు జ్యోతిబాఫూలే అని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శనివారం మహాత్మ జ్యోతిబాఫూలే జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో చిత్రపటానికి, కృష్ణవేణి చౌరస్తాలోని ఫూలే విగ్రహానికి అదనపు కలెక్టర్ ఇతర అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలే చిన్నతనం నుంచే చత్రపతి శివాజీ, జార్జివాషింగ్టన్ మొదలైన వారి జీవిత చరిత్రలను చదివి అతనిలో దేశభక్తి, సామాజిక స్పృహ అలవడ్డాయన్నారు. అప్పటి సమాజంలో నిమ్న కులాల ప్రజలు వెనకబడటానికి కారణం విద్య లేకపోవడమేనని భావించి.. పాఠశాలలు నెలకొల్పడమే కాకుండా సీ్త్ర విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తన భార్య సావిత్రిబాయి ఫూలేకు చదువు నేర్పించి బాలికల పాఠశాలలో ఆమెను ఉపాధ్యాయురాలిగా నియమించారని చెప్పారు. కులవ్యవస్థను వ్యతిరేకించి, గులాంగిరి అనే పుస్తకాన్ని రచించారన్నారు. 1878లో పుణెలో సత్యశోధక సమాజాన్ని స్థాపించి, సీ్త్ర, పురుష లింగ వివక్షతను ఫూలే తీవ్రంగా విమర్శించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, ఏఓ భూపాల్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అక్బర్‌పాషా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత తదితరులు పాల్గొన్నారు.


