గద్వాల న్యూటౌన్: న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత నాలుగు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను చర్చలకు ఆహ్వానించి.. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. గద్వాల డివిజన్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి మద్దతు పలికి మాట్లాడారు. చేస్తున్న పని స్వభావం ఒక్కటే అయినప్పుడు ఒక్కో కార్మికుడి వేతనాలు ఉద్యోగ భద్రతలలో వ్యత్యాసాలు ఎందుకని ప్రశ్నించారు. ఆర్టిజన్ కార్మికులు కొత్త కోరికలను కోరడం లేదని, తమకు ఇచ్చిన హామీలనే అడుగుతున్నారని పేర్కొన్నారు. సంస్థలో 23 వేల మంది ఆర్టిజన్ ఉద్యోగులకు స్టాడింగ్ ఆర్డర్స్ రద్దు చేసి, రెగ్యులర్ ఉద్యోగులతోపాటు ఏపీఎస్‌ఈబీ రూల్స్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కరించకపోవడం వల్లే సమ్మెబాట పట్టారన్నారు. న్యాయమైన వారి డిమాండ్లను శాంతియుత వాతావరణంలో పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నర్సింహ, అంజి, ఆర్టిజన్ యూనియన్ చైర్మన్ శివప్రసాద్, కోకన్వీనర్ రాజు తదితరులు పాల్గొన్నారు.


