గద్వాల న్యూటౌన్: ఆరోగ్యంతోపాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు యోగా దోహదం చేస్తుందని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్‌లోని గార్డెన్‌లో ఆయుష్ విభాగం ఆద్వర్యంలో యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి నిత్యం యోగా చేయడాన్ని ఒక భాగం చేసుకోవాలన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప కానుక యోగా అన్నారు. అనేక దేశాలు ప్రస్తుతం సాధన చేస్తుండటం మనకు గర్వకారణమన్నారు. యోగా ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తోందని గుర్తుచేశారు. యోగా శిక్షకులు తరుచూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రతి ఒక్కరు సాధన చేసేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం పట్టణానికి చెందిన ఆరేళ్ల చిన్నారి రశ్విక చేసిన సూర్య నమస్కారాలు, యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి రాజు, డీపీఓ శ్రీకాంత్, సర్వే ఏడీ నూకరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత, డీఏఓ వీరప్ప, జిల్లా పరిశ్రమల మేనేజర్ రామలింగేశ్వర్‌గౌడ్, యోగా శిక్షకులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.


