గద్వాల న్యూటౌన్: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ నాయకుడు రాజు స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గద్వాల డివిజన్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట 3వ రోజు సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా తమ గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో 23 వేల మంది ఆర్టిజన్ ఉద్యోగులకు స్టాడింగ్ ఆర్డర్స్ రద్దు చేసి, రెగ్యులర్ ఉద్యోగులతోపాటు ఏపీఎస్‌ఈబీ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని, 2016 నుంచి మిగిలిపోయిన కార్మికులను ఆర్టిజన్లులుగా గుర్తించాలన్నారు. ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు టీఈఈ 1104 యూనియన్ నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ కోకన్వీనర్ రాజు, కన్వీనర్ రఫీ, కోచైర్మన్ క్రాంతి, రామకృష్ణ, కృష్ణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


