వరిధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

వరిధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు

Mar 26 2026 7:44 AM | Updated on Mar 26 2026 7:44 AM

జిల్లాలో 87 కొనుగోలు కేంద్రాలు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

గద్వాల: యాసంగి సీజన్‌లో పండించిన వరిధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో యాసంగి ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. 2025–26 యాసంగి సీజన్‌ ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో మొత్తం 87 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

● జిల్లాలో ప్రాధాన్యతరంగ రుణాల లక్ష్య సాధనలో బ్యాంకర్లు ముందుండాలని.. బ్యాంకుల సహకారంతోనే అర్హులైన వారు రుణాలను సద్వినియోగం చేసుకోగలుగుతారని కలెక్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో డీసీసీ, డీఎల్‌ఆర్పీ కన్సల్టేటివ్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి అన్ని బ్యాంకులు సమన్వయంతో పనిచేసి.. నిర్దేశించిన లక్ష్యాలను వందశాతం సాధించాలన్నారు. రుణాల మంజూరులో సమతుల్యత అవసరమని.. బ్యాంక్‌ లింకేజీ ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాలకు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి..

జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాల నిర్మూలనకు అధికారులు కలిసికట్టుగా కృషిచేయాలని కలెక్టర్‌ రిజ్వన్‌ బాషా షేక్‌ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన నార్కోటిక్స్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యాసంస్ధలు, గ్రామీణ ప్రాంతాల్లో డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాల నివారణపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్కూల్‌ కాంప్లేక్స్‌ సమావేశాలు, అంగన్‌వాడీ, కేంద్రాలు, మహిళా సంఘాల సమావేశాల్లో కూడా డ్రగ్స్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఇచ్చే పౌరులకు రూ. 10వేల నగదు బహుమతి అందజేస్తామని కలెక్టర్‌ తెలిపారు.

● నమూనా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల నిర్వహణతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిగడ్డ తెలంగాణ సోషల్‌ ఫోరం సహకారంతో ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన మోడల్‌ తెలంగాణ యునైటెడ్‌ నేషన్స్‌ కార్యక్రమంలో జిల్లాలోని 22 పీఎంశ్రీ పాఠశాలల నుంచి 44 మంది విద్యార్థులు వివిధ దేశాల ప్రతినిధులుగా పాల్గొని తమ వాణి వినిపించారు. మానవ హక్కులు, వాతావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌పై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, ఏఎస్పీ శంకర్‌, ఆర్డీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement