గద్వాల క్రైం: పెండింగ్ కేసుల విషయంలో పురోగతి సాధించేందుకు సమయస్ఫూర్తితో అడుగులు వేస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.రవికుమార్ అన్నారు. ఈ నెల 28న జాతీయ లోక్‌అదాలత్ సందర్భంగా బుధవారం జిల్లా కోర్టులో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. జిల్లాలోని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు, రాజీ అయ్యే కేసుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. ప్రస్తుతం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2025లో జిల్లావ్యాప్తంగా 32,854 కేసులను విజయవంతంగా పరిష్కరించినట్లు వెల్లడించారు. శనివారం జరిగే జాతీయ లోక్‌అదాలత్‌కు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి పి.సామ్‌కోషి హాజరుకానున్నట్లు తెలిపారు. లోక్‌అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా సంబంధిత అధికారులు, న్యాయవాదులు చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు సీనియర్ సివిల్‌జడ్జి టి.లక్ష్మి ఉన్నారు.


