అనుకోని అవకాశం | - | Sakshi
Sakshi News home page

అనుకోని అవకాశం

Mar 8 2026 7:36 AM | Updated on Mar 8 2026 7:36 AM

గద్వాల: ‘మా కుటుంబం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంది.. మామ, అత్త, భర్త తుమ్మల నర్సింహులు కౌన్సిలర్లుగా పనిచేశారు. రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుంది.. ప్రజలు ఎలాంటి సమస్యలతో వస్తారు అనేది గమనిస్తూ ఉండేదాన్ని.. అయితే ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను.. చైర్‌పర్సన్‌గా అవకాశం లభిస్తుందని ఊహించలేదు..’ అని గద్వాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి అన్నారు. దీనికి ప్రధాన కారణం భర్త సంపూర్ణ సహకారంతోపాటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆశీస్సులతో వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధికి కృషిచేస్తానని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో ముఖాముఖిగా మాట్లాడారు.

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాను. ఇందుకోసం శానిటేషన్‌ పనులను తెల్లవారుజామునే నేరుగా క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తున్నాను. బాగా పనిచేసే పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారికి ప్రోత్సాహం ఇస్తున్నా. అదేవిధంగా కొంతమంది సిబ్బంది హాజరు కాకుండా విధులకు డుమ్మా కొడుతున్నారు. వారి సమస్యలు తెలుసుకొని ఇబ్బందులు తొలగించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాను.

తెల్లవారు

జామునే

క్షేత్రస్థాయిలోకి..

పిల్లలకు ఉన్నత విద్య..

మాది రాజకీయ కుటుంబ నేపథ్యం కావడంతో మా భర్త ఎప్పుడూ కూడా బిజీబిజీగా ఉంటారు. నాకు ఇద్దరు పిల్లలు కుమారుడు బీటెక్‌ పూర్తి చేసి.. చండీఘడ్‌లో ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్నాడు. మా అమ్మాయి మహాలక్ష్మి బీడీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. వీరిద్దరిపై చిన్నప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. చదువుకుంటేనే సమాజంలో గుర్తింపు వస్తుందని, మంచి భవిష్యత్‌ ఉంటుందని చెబుతూ బాగా చదువుకునేలా చేశాను.

పట్టణమే నా ఇల్లు..

మొన్నటి వరకు నా కుటుంబం, ఇల్లు మాత్రమే.. ఇప్పుడు గద్వాల పట్టణమే నా ఇల్లు. గద్వాల పట్టణాన్ని నా సొంత ఇల్లుగా భావించి అభివృద్ధి చేయాలని ఉంది. ఇందుకోసం ముందుగా పట్టణ పరిస్థితులు, అవసరాలు ఇతరత్రా వాటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సహకారంతో ముందుకెళ్తాను. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీరు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు కృషిచేస్తాను.

రాజకీయాల్లోకి వస్తా.. చైర్‌పర్సన్‌ అవుతానని ఊహించలేదు

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పటిష్ట చర్యలు

ఎమ్మెల్యే సహకారంతో గద్వాల అభివృద్ధికి కృషిచేస్తా

చదువుకుంటేనే సమాజంలో గుర్తింపు.. భవిష్యత్‌

‘సాక్షి’తో గద్వాల మున్సిపల్‌

చైర్‌పర్సన్‌ జయలక్ష్మి

Advertisement
 
Advertisement
Advertisement