నేటి నుంచి భూలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు
● 31న కల్యాణోత్సవం
● ఫిబ్రవరి 1న రథోత్సవం
గద్వాలటౌన్: గద్వాల కోటలో వెలసిన శ్రీభూలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 17 ఏళ్ల క్రితం గద్వాల కోటలోని ఆలయ పరిసరాలు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంత్రాలయ మఠానికి అప్పగించారు. గద్వాల పెద్ద జాతరగా పిలువబడే చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలకు గద్వాల చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు కర్ణాటకకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. పెద్ద జాతర సందర్భంగా జమ్ములమ్మ ఉత్సవాలు ప్రారంభం కావడంతో గద్వాల ప్రాంతంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
వారం పాటు..
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 4 వరకు శ్రీ భూలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. 31న కల్యాణోత్సవం, ఫిబ్రవరి 1న రాత్రి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు మంత్రాలయ పీఠాధిపతి సుబుధేంద్రతీర్థ శ్రీపాదుల హోమాలు, విశేష పూజలు నిర్వహిస్తారు. వేడుకలకు మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ, కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత, ఇతర జిల్లా ఉన్నతాధికారులు వేరువేరు సందర్భాల్లో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. లింగంబావిలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ విచారణకర్త ప్రభాకర్, మేనేజర్ శ్రీపాదజోషి కోరారు.
నేటి నుంచి భూలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు


