‘అత్తా అల్లుడి జిమ్మిక్కులను పటాపంచలు చేద్దాం’
గద్వాలటౌన్: మున్సిపల్ ఎన్నికల సమయంలో అత్తా అల్లుడు చేస్తున్న రాజకీయ జిమ్మిక్కులను ప్రజలు పటాపంచలు చేయాలని రాష్ట్ర స్పోర్ట్స్ అఽథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. బుధవారం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బీఆర్‌ఎస్‌లోనే ఉంటే గులాబీ కండువా కప్పుకొని ప్రజల ముందుకు రావాలని సవాల్ విసిరారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెబుకుంటున్న ఎమ్మెల్యే.. రెండేళ్ల కాలంలో ఏం అభివృద్ది సాధించారో ప్రజలకు వివరించాలన్నారు. గద్వాలలో అత్తా, మామ, అల్లుడు చేస్తున్న రాజకీయాలను ప్రజలను గమనిస్తున్నారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అల్లుడి గెలుపు కోసం డీకే అరుణ గద్వాలలో పోటీ నుంచి తప్పుకొన్నారని ఆరోపించారు. బంగ్లా వారసత్వం కోసం అరుణమ్మ ఆరాటపడుతున్నారని విమర్శించారు. గులాబీ శ్రేణుల శ్రమ, త్యాగంతో ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేకు ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌లో నిర్మించిన భవనాలకు రంగులు మార్చడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. గద్వాలలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాగా, బీజేపీ జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జి చిత్తారి కిరణ్ సుమారు 200 మందితో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 5వ వార్డు నుంచి కాంగ్రెస్ నాయకుడు సంటన్న, 24వ వార్డు నుంచి రియాజ్, 31వ వార్డు నుంచి సుజాత, రాజు, 35వ వార్డు నుంచి అప్సర్ తన అనుచరులతో బీఆర్‌ఎస్‌లో చేరగా.. వారికి ఆంజనేయగౌడ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, హనుమంతు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, పద్మ వెంకటేశ్వర్‌రెడ్డి, కోటేష్, యూసుఫ్, అతికూర్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.


