మిగిలింది.. రెండు రోజులే | - | Sakshi
Sakshi News home page

మిగిలింది.. రెండు రోజులే

Dec 9 2025 9:25 AM | Updated on Dec 9 2025 9:25 AM

మిగిలింది.. రెండు రోజులే

మిగిలింది.. రెండు రోజులే

నేటితో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం

అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్‌

గద్వాల: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఇంకా రెండు రోజుల సమయమే మిగిలింది. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ధరూరు, గద్వాల, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో 106 సర్పంచ్‌, 974 వార్డు స్థానాలకు గాను 14 సర్పంచ్‌, 120 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన జీపీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, ఎన్నికల ప్రచారానికి కేవలం ఒకరోజు మాత్రమే సమయం ఉండటంతో తొలి విడత గ్రామాల్లోని అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది.

48 గంటల ముందుగానే..

ఎన్నికలకు 48 గంటల ముందుగానే అభ్యర్థుల ఎన్నికల ప్రచార మైక్‌లు మూగబోనున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారానికి బ్రేక్‌ పడనుంది. అయితే ఇప్పటికే గ్రామాల్లో అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి నుంచి ఈ ప్రలోభపర్వం మరింత ఊపందుకోనుంది.

గెలుపే లక్ష్యంగా హామీలు..

గ్రామాల్లో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతున్నారు. ఇంటింటి ప్రచారంతో పాటు సోషల్‌ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గంపగుత్తగా ఓట్లను పొందేందుకు కుల, మహిళా సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో గెలుపు కోసం భారీస్థాయిలో హామీలు గుప్పిస్తున్నారు. గ్రామాల్లో ఆలయాల నిర్మాణం, అభివృద్ధి పనులతోపాటు వ్యక్తిగత పనులపై సైతం హామీలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఒకరికి మించి మరొకరు అన్నట్టుగా ఓటర్ల మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారు.

మద్యం దుకాణాలు బంద్‌..

తొలి విడత ఎన్నికల నేపథ్యంలో 48 గంటల ముందుగానే వైన్‌షాపులు బంద్‌ కానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి వైన్‌షాపులను మూసివేయనున్నారు. ఈ నెల 11న పోలింగ్‌ నిర్వహించనుండగా.. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాల వెల్లడి పూర్తయ్యే వరకు వైన్‌షాపులను మూసివేసి ఉంచనున్నారు. వైన్‌షాపుల మూసివేత నేపథ్యంలో పలు గ్రామాల అభ్యర్థులు ఇప్పటికే భారీ స్థాయిలో మద్యాన్ని కొనుగోలు చేసి డంపులుగా నిల్వ చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement