నిషేధం ఉత్తిదే!
జిల్లాలో జోరుగా ప్లాస్టిక్ వినియోగం
● నియంత్రణ చర్యలపై అధికారుల నిర్లక్ష్యం
● ప్రజారోగ్యం, పర్యావరణానికి పెనుభూతం
● 2022, జూలై 1 నుంచి
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం
గద్వాలటౌన్: ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెనుభూతంలా మారిన ఒకసారి వినియోగించి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం 2022 జూలై 1 నుంచి నిషేధం విధించినా జిల్లాలో ఎక్కడా అది అమలు జరగడం లేదు. స్ట్రాలు, థర్మకోల్ సీట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వంటి 19 రకాల వస్తువులపై ఈ నిషేధం వర్తించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ప్లాస్టిక్ కాలుష్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌దే అగ్రస్థానం. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 75 మైక్రానుల కన్నా తక్కువ మందం ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం ఉంది. 2022 డిసెంబర్ నుంచి 120 మైక్రాన్లలోపు ఉండే కవర్లను, వస్తువులను తయారు చేయడం, అమ్మడం, వినియోగించడాన్ని కూడా నిషేధించారు. ప్రభుత్వం నిషేధం విధించిన కొత్తలో కొద్ది రోజుల పాటు హడావుడి చేసిన అధికార యంత్రాంగం నిరంతరం తనిఖీలు చేశారు. ఆ తర్వాత మెల్లగా అటకెక్కించారు. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచులను, వస్తువులను పూర్తిగా నిషేధించారు. మొదట్లో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వ్యాపారులతో ఉన్న పాలిథిన్ సంచులను స్వాధీనం చేసుకున్నారు. కొంతమందికి జరిమానాలు సైతం విధిస్తు ఉక్కుపాదం మోపారు.
అవగాహన కల్పిస్తున్నాం
రెండేళ్ల క్రితమే ప్లాస్టిక్ సంచుల నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నాం. అధికారులు, సిబ్బంది కలిసి దాడులు చేసి ప్లాస్టిక్ విక్రయాలను అడ్డుకుంటున్నాం. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే వంద శాతం నిర్మూలన సాధ్యమవుతుంది. ప్లాస్టిక్ విక్రయాలు చేస్తే జరిమానాలతో పాటు దుకాణం లైసెన్సు రద్దు చేస్తాం. జరిమానాలు సైతం విధించడం జరిగింది.
– జానకీరాం, కమిషనర్, గద్వాల
మార్పు వచ్చే సమయంలో...
జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధించడంతో వ్యాపారులు సైతం పాలిథిన్ కవర్ల వినియోగించడాన్ని నిలిపివేశారు. సరుకు కొనుగోలు చేసేందుకు వచ్చే వినియోగదారులకు చేతి సంచులు తీసుకురావాలని వ్యాపారులు సూచించడంతో కొద్ది రోజులు నిషేధం సాఫీగానే సాగింది. అధికారులు తనిఖీలు తగ్గించడంతో వ్యాపారులు అన్ని వస్తువులు ప్లాస్టిక్ కవర్లలోనే ఇస్తుండటంతో మళ్లీ మొదటికొచ్చింది. కూరగాయలు, పూలు, పండ్ల వ్యాపారులు పల్చని సంచులు వాడటం, ఏ శుభకార్యం జరిగినా కల్యాణ మండపాలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్ల నుంచి ప్యాకింగ్ సంచులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, చెంచాలు, కప్పులు వేల సంఖ్యలో బయటకు వస్తున్నాయి. దుకాణాల్లో ఒకసారి వాడి పడేసే వస్తువులు, కవర్లు విక్రయం, వినియోగం యథేచ్చగా జరుగుతుంది.
గ్రామాల్లో సైతం..
ప్లాస్టిక్ భూతం గ్రామాల్లో సైతం కోరలు చాచుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఓ సెగ్రిగేషన్ షెడ్ నిర్వహించి చెత్తను రీసైక్లింగ్ చేయాల్సి ఉన్నా ఎక్కడా అమలులోకి రావడం లేదు. కొన్ని ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ను విచ్చలివిడిగా తగులబెడుతుండడంతో గాలి, నేల, నీటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ప్లాస్టిక్‌ను బహిరంగ ప్రదేశాల్లో వేస్తుండడంతో వాటిని తినే మూగజీవాలు తీవ్ర అస్వస్థతకు గురై మృత్యువాతపడుతున్న ఘటనలు ఉన్నాయి.
నిషేధం ఉత్తిదే!
నిషేధం ఉత్తిదే!


