సీసీఐ కేంద్రం వద్ద రైతుల ధర్నా
● పత్తిని పరిశీలించకుండానే
వద్దంటున్న సీసీఐ అధికారి
● జాతీయ రహదారిపై రెండు
కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
● ఎస్‌ఐ నచ్చజెప్పడంతో శాంతించిన రైతులు
ఉండవెల్లి: పత్తి కొనుగోలు కేంద్రం వద్ద సీసీఐ అధికారి అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ రైతులు జాతీయ రహదారిపై గురువారం ధర్నా నిర్వహించారు. దాదాపు 2 గంటలు ధర్నా కొనసాగించడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కేంద్రంలో అధికారి తేమశాతం మాత్రమే చూడాలని, పత్తిని చూడకుండానే నల్లగా ఉందని తిప్పి పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కురిసిన వర్షాలకు పత్తి పాడైందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సీసీఐ అధికారులు, మార్కెటింగ్ అధికారులు దళారులకే కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. రైతులు రోడ్డుపై ధర్నా చేస్తున్న అధికారి ఎలాంటి చలనం లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండని దబాయిస్తున్నాడని వాపోయారు. ఇంటికాడ పిల్లలున్నారని, చీకటి పడకముందే ఇంటికి పోవాలని మిల్లు వద్దకు పత్తి తెచ్చిన భార్యాభర్తలు వేడుకుంటున్నా.. సీసీఐ అధికారి పట్టించుకోకుండా పక్కకు వెళ్లి వేరే వాహనంలో ఉన్న పత్తి మ్యాచర్ చూశారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. వర్షంలో తడిసిన పత్తిని ప్రభుత్వమే కొనకపోతే సీసీఐ కేంద్రాలు ఎందుకు తెరిచారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐ శేఖర్ ధర్నా వద్దకు వచ్చి రైతులకు నచ్చజెప్పడంతో శాంతించారు. మార్కెటింగ్ కార్యదర్శి ఎల్లస్వామితో ఎస్‌ఐ మాట్లాడగా.. తమకు ఈ విషయంలో ఎలాంటి ప్రమేయం లేదని, సీసీఐ అధికారే దీనికి బాధ్యులు అని కార్యదర్శి తెలిపారు. దీంతో ఎస్‌ఐ సీసీఐ అధికారితో చర్చించగా.. ‘మా రూల్స్ మాకు ఉంటాయి.. ఎవరు చెప్పినా వినమని’ ఆయన తెగేసి చెప్పాడు. దీంతో ఎస్‌ఐ శేఖర్ స్పందిస్తూ శుక్రవారం ఉదయం మరోమారు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి, రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. దీంతో సీసీఐ అధికారి తీరుపై రైతులు ఆందోళన చెందుతున్నారు.


