తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు
ధరూరు: రైతులు సాగులో నూతన పద్ధతలు పాటించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కార్యాలయంలో పామాయిల్ సాగుపై మండల రైతులకు అవగాహన కల్పించారు. సింగిల్ విండో చైర్‌పర్సన్ మహదేవమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆయిల్‌పాం సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, ఆసక్తి ఉన్న రైతులు సంప్రదించాలని కోరారు. ఇప్పటికే సాగు చేసుకున్న రైతులకు, నూతనంగా సాగు చేసుకునే రైతులకు ఏమైనా సందేహాలు ఉన్నా అధికారులను కలిసి నివృత్తి చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈఓ రాజు, ఉద్యావన శాఖ డివిజన్ అధికారి రాజశేఖర్, విస్తరణ అధికారి మేఘారెడ్డి, శివకుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
గద్వాల మార్కెట్
సమాచారం
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు గురువారం 1,735 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. క్వింటాల్‌కు గరిష్టం రూ.5,901, కనిష్టం రూ.2,606, సరాసరి రూ.5,199 ధరలు లభించాయి. 134 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టం రూ.5,909, కనిష్టం రూ.5689, సరాసరి రూ.5709 ధరలు పలికాయి. 192 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టం రూ. 2149, కనిష్టం రూ.1871, సరాసరి ధరలు రూ.1929 పలికింది.
ఆత్మీయ సభ
విజయవంతం చేయాలి
వనపర్తి రూరల్: మహబూబ్‌నగర్‌లో ఈ నెల 9న రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉమ్మడి జిల్లా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సభ వాల్‌పోస్టర్లను గురువారం పెబ్బేర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్, ఉపాధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అధికసంఖ్యలో పాల్గొని ఆత్మీయ సభను విజయవంతం చేయాలని కోరారు. మత్స్య కళాశాల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.
రామన్‌పాడులో
తగ్గిన నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో గురువారం నీటిమట్టం తగ్గినట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 862 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 129 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరి సముద్రమట్టానికిపైన 1,020 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 693 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు.


