ఆశలకు ‘గండి’..
● తరచుగా కోతకు గురవుతున్న కేఎల్‌ఐ కాల్వలు
● ఏటా ఏదో ఒక చోట తెగుతున్న వైనం
● పంటలు దెబ్బతిని రైతులకు భారీ నష్టం
సాక్షి, నాగర్‌కర్నూల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన సాగునీటి కాల్వలు నిర్వహణకు నోచుకోవడం లేదు. సుమారు 20 ఏళ్ల క్రితం కాల్వల నిర్మాణం చేపట్టగా.. ఇప్పటి వరకు కాంక్రీట్ లైనింగ్ ఏర్పాటు చేయకపోవడంతో తరచుగా కాల్వలు తెగుతున్నాయి. దీంతో సమీపంలోని రైతుల పంటపొలాలను వరద ముంచెత్తి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కాల్వలు చెంతనే ఉన్నాయన్న ఆశతో పంటలు వేసుకుంటున్న రైతులకు చివరికి కన్నీరే మిగులుతోంది. పంటలు చేతికొచ్చే సమయంలో కాల్వలకు గండ్లు పడి పంటంతా నీటిపాలవుతోంది. ఏటా ఇదే తంతు కొనసాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, కల్వకుర్తి, వెల్దండ, పాన్‌గల్ మండలాల్లో తరుచుగా కాల్వలు తెగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అడుగడుగునా గండ్లతో నష్టం..
కేఎల్‌ఐ కాల్వకు ఒకేచోట ఆరుసార్లు గండి పడినా అధికారులు మాత్రం తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారు. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయితే నానాటికీ బలహీనమైన కాల్వ కట్టలకు తరచుగా గండ్లు పడి రైతులు నష్టపోవాల్సి వస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి మండలం తోటపల్లి, వెంకటాపూర్, తిమ్మరాసిపల్లి, నెల్లికట్ట, వెల్దండ సమీపంలోని కేఎల్‌ఐ కాల్వ అధ్వానంగా తయారైంది. వనపర్తి జిల్లాలోని పాన్‌గల్, రేవల్లి మండలాల్లోని కేఎల్‌ఐ కాల్వలతోపాటు భీమా కాల్వకు పలు చోట్ల గండి పడటంతో రైతులు పెద్దసంఖ్యలో నష్టపోతున్నారు. పాన్‌గల్ మండలంలోని పలు గ్రామాల సమీపంలో కాల్వ తెగి రైతుల పొలాలు నీటమునుగుతున్నాయి.
నిధులు లేక నిర్వహణ గాలికి..
కేఎల్‌ఐ కాల్వల నిర్మాణం 2005లో చేపట్టగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం మరమ్మతు, నిర్వహణకు నోచుకోవడం లేదు. సుమారు పదేళ్లుగా కాల్వలను అధికారులు గాలికి వదిలేశారు. ప్రతిసారి వేసవిలో కాల్వలకు మరమ్మతు చేపట్టి.. కాల్వ కట్టలను పటిష్టం చేయాల్సి ఉండగా, గడిచిన పదేళ్లలో ఒక్కసారి కూడా మరమ్మతు చేపట్టలేదు. కేఎల్‌ఐ కింద కేవలం చెరువులు, కుంటలు నింపడం.. ఉన్న కొద్దిపాటి కాల్వలకు సాగునీరందించేందుకే అధికారులు పరిమితమవుతున్నారు. పంపుహౌస్‌ల్లో మోటార్లకు సైతం మరమ్మతు చేయకపోవడంతో.. సరైన స్థాయిలో పంపింగ్ చేపట్టక చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు.
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ సమీపంలోని కేఎల్‌ఐ కాల్వ ఏడేళ్ల వ్యవధిలో ఇక్కడే
ఆరుసార్లు తెగింది. కాల్వ తెగినప్పుడల్లా
అధికారులు మట్టివేసి తాత్కాలిక మరమ్మతు చేపడుతున్నా.. నీటి ప్రవాహం ధాటికి తరుచుగా తెగుతోంది. ఫలితంగా సమీపంలోని రైతుల పంటపొలాలు నీటిపాలవుతున్నాయి. సిమెంట్ లైనింగ్ చేపడితేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతులు చెబుతున్నారు.
పటిష్టానికి చర్యలు..
కేఎల్‌ఐ కింద కాల్వల నిర్వహణకు చర్యలు తీసుకుంటాం. కాల్వలకు గండి పడితే వెంటనే స్పందించి కట్టడి చేస్తున్నాం. అవసరమైన చోట్ల మరమ్మతు చేస్తున్నాం. విడతల వారీగా కాల్వల పటిష్టానికి చర్యలు చేపడతాం.
– విజయ్‌భాస్కర్‌రెడ్డి, సీఈ, నీటిపారుదల శాఖ


