చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది
ధరూరు: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం వారు ధరూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 81 కేంద్రాలకు గాను మొదటి కేంద్రాన్ని ధరూరులో ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలోనే అన్ని కేంద్రాలను ప్రారంభించి వడ్లు కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, బీ గ్రేడ్‌కు రూ.2,369 ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుందని పేర్కొన్నారు. ధాన్యం కేంద్రానికి తీసుకొచ్చేటప్పుడు తేమ శాతం 17కి మింకుండా చూసుకోవాలన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, మహిళా సంఘాల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా ర్యాలంపాడు రిజర్వాయర్‌ను నింపి రైతులకు ఈసారి కూడా రెండో పంటకు సాగు నీరు అందిస్తామన్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరయ్యే గన్నీ బ్యాగులతో పాటు టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, అడిషనల్ డీఆర్‌డీఓ శ్రీనివాసులు, మార్కెట్ యార్డు చైర్మన్ హనుమంతు, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీఓ కృష్ణమోహన్, ఏపీఎం నరహరి, ఏఓ శ్రీలత, మహిళా సంఘం నాయకురాలు ఖాజాబీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌గౌడ్, రాజశేఖర్, కురుమన్న తదితరులు పాల్గొన్నారు.


